వ్యవసాయ రంగంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకువచ్చి పంటలు దెబ్బతిన్న రైతులకు సీజన్ ముగిసేలోపే ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలనే మాట ప్రకారం ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా నెరవేరుస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇదంతా కూడా రైతుల అభివృద్ది, రైతుల సంక్షేమం, రైతు శ్రేయస్సు కాంక్షించి సీఎంగారు తీసుకున్న నిర్ణయాల ఫలితమే అన్నారు. వరుసగా ఐదో ఏడాది మొదట విడతగా... కౌలు రైతులకు వైయస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంట సాగుదారు హక్కు పత్రాలు(సీసీఆర్సీలు) పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులు, దేవాదాయ భూముల సాగుదారులకు తొలివిడతగా వైయస్ఆర్ రైతు భరోసా సాయంగా రూ.109.01 కోట్లు, పంట నష్టపోయిన 11,373 మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా రూ.11.01 కోట్లతో కలిపి మొత్తం రూ.120.75 కోట్ల ఆర్ధిక సాయాన్ని క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైయస్ జగన్ జమ చేశారు.