తిరుమల శ్రీవారికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జరిగే బ్రహ్మోత్సవాలకు విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉందన్నారు ఈవో ధర్మారెడ్డి. తిరుమల అన్నమయ్య భవనంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్, టీటీడీలోని అన్నివిభాగాల అధికారులతో ఈవో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు
సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. అలాగే అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. సెప్టెంబరు 18న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చేతులమీదుగా శ్రీనివాస సేతు, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనం, తిరుమలలో విశ్రాంతి గృహాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయన్నారు. గరుడసేవను రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరికీ దర్శనం కల్పిస్తూ నిదానంగా ముందుకు తీసుకెళతామన్నారు.
శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాలు నిర్మించిన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మత్స్యకార ప్రాంతాల్లోని భక్తులకు రోజుకు వెయ్యి మంది చొప్పున బ్రహ్మోత్సవ దర్శనం చేయిస్తామని తెలిపారు. వీరికి ఉచితంగా రవాణా, భోజనం, బస కల్పిస్తామన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని, వారికి సంతృప్తికరంగా వాహనసేవల దర్శనంతో పాటు మూలమూర్తి దర్శనం కల్పిస్తామని చెప్పారు. బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించబడవని.. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులను మాత్రమే అనుమతిస్తామని వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసినట్టు వెల్లడించారు.
భక్తుల భద్రత దృష్ట్యా సెప్టెంబరు 22న గరుడసేవ నాడు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేశామన్నారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు రవాణా, వైద్యం తదితర సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేశారు. బ్రహ్మోత్సవాల కోసం విభాగాల వారీగా ప్రత్యేక ఏర్పాట్లు చేపడతామని చెప్పారు. భక్తుల కోసం పలు ప్రాంతాల్లో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో తొమ్మిది రాష్ట్రాల నుండి కళాకారులను ఆహ్వానించి వాహనసేవల ఎదుట కళాప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని వివరించారు. వాహనసేవల ఎదుట ఏనుగులు, అశ్వాలు, వృషభాలు ప్రత్యేక అలంకరణలో పాల్గొంటాయని, వీటి నిర్వహణ కోసం కేరళ నుండి నిపుణులను రప్పిస్తున్నామని చెప్పారు. అటవీ శాఖ తిరిగి ఆదేశాలు జారీ చేసే వరకు నడక మార్గాల్లో ఇప్పుడున్న నిబంధనలు కొనసాగుతాయని తెలిపారు.
గతేడాది తరహాలోని జిల్లాలోని అన్ని విభాగాలను భాగస్వాములను చేసి శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తామన్నారు జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. టీటీడీతో సమన్వయం కోసం నలుగురు అధికారులను ఇప్పటికే ఏర్పాటు చేశామని.. ఎక్సైజ్ చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ట్యాక్సీలకు ధరలు నిర్ణయించి స్టిక్కర్లు అంటిస్తామని.. రుయా ఆసుపత్రి, ఇతర ప్రాంతాల నుండి వైద్యులను, మందులను అందుబాటులో ఉంచుతామని వివరించారు.
బ్రహ్మోత్సవాలకు తగినంత మంది సిబ్బందితో పూర్తి భద్రత కల్పిస్తామని ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన, గరుడ సేవ, చక్రస్నానం రోజుల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపడతామన్నారు. శ్రీవారి ఆలయం, మాడ వీధులు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, అలిపిరి చెక్ పాయింట్ తదితర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడతామన్నారు. భక్తుల రద్దీతోపాటు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తిరుపతి నగరం శివార్లలో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తామన్నారు. తిరుపతిలోని రైల్వే స్టేషన్, బస్టాండు, భక్తులు సంచరించే అన్ని ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి మెరుగ్గా పారిశుద్ధ్య చర్యలు చేపడతామని తెలిపారు తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ హరిత.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa