తెలుగు జాతి గర్వించదగిన మహనీయుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆగస్టు 28న.. నందమూరి కుంటుబ సమక్షంలో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ వంద రూపాయల స్మారక నాణేన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఎన్టీఆర్‌ను దైవంలా భావించే ఎందరో తెలుగువారు.. ఆయన స్మారక నాణేన్ని కొనుగోలు చేసేందుకు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా.. 29వ తారీఖు నుంచి ఈ నాణేలను అమ్మకానికి పెట్టగా.. కాయిన్స్ సొంతం చేసుకునేందుకు అభిమానులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. దీంతో ఎన్టీఆర్ కాయిన్‌పై బ్లాక్ మాఫియా కన్నేసినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ నాణేన్ని www.indiagovtmint.in అనే వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించగా.. కొందరు కేటుగాళ్లు నాణేలను బ్లాక్ చేసి.. దేశవిదేశాల్లోని అభిమానులకు అడ్డగోలు ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు మొదలయ్యాయి.
ఎన్టీఆర్ 100 రూపాయల కాయన్ ధరను రూ. 4850గా నిర్ణయించిన విషయం తెలిసిందే. బ్లాక్ మార్కెట్‌లో రూ. 5000 నుంచి రూ. 10000 వరకు దేశ విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులకు అమ్ముకుంటున్నారు కేటుగాళ్లు. వెబ్‌సైట్‌లో పెద్ద ఎత్తున ముందుగానే బ్లాక్ చేసి కాయిన్లు పొందుతూ వాటిని.. దేశ విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులకు అమ్ముకుంటూ కరెన్సీ మాఫియా చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయం బయటికి రావటంతో.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అన్నగారి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
భారత ఆర్థిక శాఖకు చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్టీఆర్ 100 రూపాయల కాయిన్లను అమ్ముతోంది. ఎన్టీఆర్ స్మారక నాణేలను www.indiagovtmint.in వెబ్‌సైట్ ద్వారా అమ్ముతున్నారు. కాగా.. ఒక్కో కాయిన్ ధర రూ.4850గా నిర్ణయించగా... ఎల్లో, బ్రౌన్ కలర్లలో కాయిన్లతో పాటు గోల్డ్, సిల్వర్ కాయిన్లను కూడా విక్రయిస్తున్నారు. అయితే.. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింకుతో ఎన్టీఆర్ 100 రూపాయల నాణేన్ని తయారు చేశారు.
హైదరాబాద్‌లో సైఫాబాద్‌లోని మింట్ సేల్ కౌంటర్ నుంచి ఎన్టీఆర్ 100 రూపాయల కాయిన్స్‌ను నేరుగా కొనుక్కోవచ్చు. ఇక్కడే కాకుండా.. చర్లపల్లిలోని ఐజీ మింట్ సేల్ కౌంటర్‌లో కూడా ఈ కాయిన్స్‌ను అందుబాటులో ఉంచారు.