వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న వైయస్ రాజారెడ్డి, జయమ్మ దంపతులకు జన్మించిన వైయస్ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రిని ఏర్పాటు చేసి.. రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల మన్ననలు పొందారు. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైయస్ రాజశేఖరరెడ్డి.. 1978లో రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందే వరకు తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు. సీఎంగా వైఎస్ రాజశేఖరరెడ్డి పాలించింది ఐదేళ్ల మూడు నెలలే ఆ కొద్ది కాలంలోనే ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో చూపించారు. సంక్షేమం, అభివృద్ధికి మానవీయతను జోడించిన మహనీయుడు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల మూడు నెలలే పని చేశారు. మంచి చేయాలన్న మనసుంటే.. ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో ఆ కొద్ది కాలంలోనే చేసి చూపించారు. సమగ్రాభివృద్ధి వైపు రాష్ట్రాన్ని ఎలా పరుగులెత్తించవచ్చో దేశానికే చాటి చెప్పారు. అందుకే ఆ మహానేత భౌతికంగా దూరమై 14 ఏళ్లు దాటిపోయినా, ఇప్పటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.