ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు,,,,ప్రధాని, కేంద్రమంత్రులు, బీజేపీ నేతలకు సీఎం స్టాలిన్ప్ర శ్నలు

national |  Suryaa Desk  | Published : Thu, Sep 07, 2023, 08:29 PM

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సహా కమలం పార్టీ నాయకులు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయనిధి స్టాలిన్ తల నరికి తెస్తే రూ.10 కోట్లు ఇస్తానని ఏకంగా ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యకు చెందిన ఓ స్వామీజీ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఈ పరిణామాల మధ్య ఉదయనిధి స్టాలిన్ తండ్రి, తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పందించారు.


ఈ వ్యాఖ్యలపై తొలిసారి మాట్లాడిన ఎంకే స్టాలిన్‌.. ఉదయనిధి స్టాలిన్‌ ఏం మాట్లాడారో తెలుసుకోకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కామెంట్లు చేయడం సరికాదని పేర్కొన్నారు. అయితే తన కొడుకు మాట్లాడిన మాటలను బీజేపీ వక్రీకరించిందని స్టాలిన్ మండిపడ్డారు. జాతి నిర్మూలనకు మంత్రి పిలుపునివ్వలేదని కేవలం వివక్షకు వ్యతిరేకంగా మాత్రమే ఉదయనిధి మాట్లాడారని ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. వాస్తవాలను ధృవీకరించడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ బాధ్యత కలిగిన ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు వాటిని పక్కన పెట్టి.. నకిలీ వార్తలను ప్రచారం చేయడం తనకు తీవ్ర బాధ కలిగించిందని వెల్లడించారు. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని విమర్శలు చేస్తున్నారని ఎంకే స్టాలిన్‌ అన్నారు. సనాతన ధర్మంలోని అణిచివేత సూత్రాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే బీజేపీ, బీజేపీ అనుకూల శక్తులు ఉదయనిధి వైఖరిని సహించలేకపోతున్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ కారణంగానే సనాతన ఆలోచనలు గల వ్యక్తులను నరమేధం చేయాలని ఉదయనిధి పిలుపునిచ్చాడంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నిరంతరం పెంచి పోషిస్తున్న ఓ వర్గం సోషల్ మీడియా గ్రూపు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ అబద్ధాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోందని స్టాలిన్ విమర్శించారు.


ఈ క్రమంలోనే ఉదయనిధి తల నరికి తీసుకువస్తే రూ. 10 కోట్లు ఇస్తానంటూ అయోధ్య స్వామీజీ చేసిన ప్రకటనపైనా స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ఇలాంటి ప్రకటన చేసిన స్వామిజీపై ఏం చర్యలు తీసుకున్నారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వ్యాఖ్యలు చేసిన ఉదయనిధిపై కేసులు పెట్టారని దుయ్యబట్టారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సమర్థంగా తిప్పికొట్టాలని కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ప్రధాని మోదీ చెప్పినట్లు మీడియా ద్వారా తెలిసిందని.. ఇది చాలా నిరాశకు గురి చేసిందని స్టాలిన్ పేర్కొన్నారు. దేశంలో ఏ ఆరోపణలనైనా, వ్యాఖ్యలనైనా నిజమా అబద్ధమా అని ధృవీకరించేందుకు ప్రధానమంత్రికి అన్ని అవకాశాలు ఉంటాయని పేర్కొన్న ఎంకే స్టాలిన్.. మరి అలాంటి సమయంలో ఉదయనిధిపై వస్తున్న అబద్ధపు ప్రచారాల గురించి ప్రధానికి తెలియదా లేక తెలిసే అలా చేస్తున్నారా అని ప్రశ్నించారు.


ఈ క్రమంలోనే సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఎంకే స్టాలిన్.. ఇప్పటికీ కొంత మంది ఆధ్యాత్మిక వేదికలపై మహిళలను కించపరుస్తున్నారని.. మహిళలు కొన్ని పని చేయకూడదని.. వితంతు పునర్వివాహాలు చేసుకోకూడదని వాదిస్తున్నారని గుర్తు చేశారు. సమాజంలో సగానికి పైగా ఉన్న స్త్రీలపై అణచివేతను కొనసాగించడానికి వారు సనాతన అనే పదాన్ని ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి కొన్ని అణచివేత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాత్రమే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారని..ఆ సిద్ధాంతాలపై ఆధారపడిన పద్ధతులను నిర్మూలించాలని పిలుపునిచ్చారని తన కొడుకు వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. చంద్రయాన్ లాంటి అద్భుత ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించి ఎంతో ఘన కీర్తి సాధించిన భారత దేశంలో సనాతన ధర్మం పేరిట ఇలాంటి మహిళలను చిన్న చూపు చూడటం, జాతి వివక్ష ఉండటం ఏంటని ప్రశ్నించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa