టీడీపీ అధినేత చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమానికి ఓ బ్రాండ్ అన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. కక్ష సాధించడమే సీఎం జగన్ లక్ష్యమని.. ఎటువంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సృష్టించి అరెస్ట్ చేశారని.. ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేశారన్నారు. ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్షసాధింపులే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. జగన్ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
జగన్‌పై ఈడీ సహా అనేక కేసులున్నాయి.. బెయిల్‌పై బయట తిరుగుతున్నారంటూ బాలయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని.. న్యాయ పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రం కోసం ప్రతిఒక్కరూ ఉద్యమించాల్సిన సమయం ఇదేనని.. చంద్రబాబుకు సానుభూతి తెలిపిన ప్రతిఒక్కరినీ కలుస్తానన్నారు. 'నేనొస్తున్నా.. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. తెలుగువాడి సత్తా, పౌరుషాన్ని చూపెడదాం' అన్నారు బాలయ్య. ఇలాంటివి ఎన్నో చూశాం.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు.
చంద్రబాబు అరెస్టుతో కొందరు ప్రాణాలు కొల్పోయారని.. ఆ కుటుంబాలను పరామర్శిస్తానన్నారు. టీడీపీ కార్యకర్తలు ఎవ్వరికీ భయపడనక్కర్లేదన్నారు. 'నేను వస్తున్నా.. నేనే ముందుంటా. స్వాతంత్ర్య సమరం మనం చూడలేదు. కానీ ఇప్పుడు ఆ స్ఫూర్తితో పోరాడాల్సి ఉంటుంది' అన్నారు. జగన్ చేసే కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారని.. ప్రజలు అనుభవించింది చాలు.. మార్పుకోసం సైనికుల్లా పనిచేయాలన్నారు. మొరిగితే పట్టించుకోను.. అతిక్రమిస్తే ఉపేక్షించను అన్నారు. పీల్చే గాలిపై కూడా పన్నులు వేస్తారని.. ఇలాగే భయపడుతూ కూర్చొంటే ఏపీ సర్వ నాశనం అవుతుందన్నారు. సైనికుల్లా ప్రతి ఒక్కరూ తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందని.. ఆలోచించడం కాదు.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు. మాట తప్పని పార్టీ టీడీపీ.. మాట తప్పకపోవడం అనేది ఎన్టీఆర్ నుంచి పార్టీకి వారసత్వంగా వచ్చింది అన్నారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారన్నారు. టీడీపీ ఎన్నో సంక్షోభాలు చూసింది.. ఇప్పుడూ అధిగమిస్తామన్నారు. ఇప్పుడే కాదు.. ఇంకా కేసులు పెడతారన్నారు. రూ.10 ఇచ్చి.. రూ. 100 గుంజుకునే స్వభావం అధికార పార్టీది అన్నారు. హిందూపురంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధే మిగిలింది.. ఇప్పుడు అభివృద్ధే లేదన్నారు. ప్రజల పక్షాన పోరాడతామని.. యువతను స్ట్రీమ్ లైన్ చేయాల్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ ముందుగా గుజరాత్‌లో ప్రారంభించారని బాలయ్య గుర్తు చేశారు. సీఎం కేవలం పాలసీ మేకర్.. అధికారులే అమలు చేస్తారన్నారు. అజేయ కల్లం ప్రతిపాదిస్తే.. ప్రేమ్‌చంద్రారెడ్డి అమలు చేశారన్నారు. ప్రభుత్వం రూ.370 కోట్లు ఖర్చు చేసి 2.13 లక్షలమందికి శిక్షణ ఇచ్చారన్నారు. డిజైన్ టెక్ సంస్థకు జగన్ ప్రభుత్వం అభినందన లేఖ ఇచ్చిందని.. జగన్ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా అన్నారు. పేద విద్యార్థుల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారన్నారు. వేలమంది యువతకు ఉపాధి కల్పించిన సంగతి మరిచారా అన్నారు.. హిందూపురంలో 1,200 మందికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలని.. ఛార్జిషీట్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని.. రాజకీయ కక్షసాధింపులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa