'భారత అంతరిక్ష యాత్రలో మహోజ్వల ఘట్టం - చంద్రయాన్ విజయం' అన్న అంశంపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొని మాట్లాడారు. అంతరిక్ష ప్రయోగాలలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరు అభినందనీయులని చెప్పారు. భారత అంతరిక్ష కార్యక్రమాల కోసం కేవలం 2 బిలియన్ డాలర్ల బడ్జెట్ మాత్రమే ఉంది. అదే అమెరికాకు చెందిన నాసాకు 62 బిలియన్ డాలర్ల బడ్జెట్ ఉంది. అంటే ఇస్రో బడ్జెట్ కంటే అది 31 రెట్లు అధికమన్నారు. ఒక బ్లాక్‌బస్టర్ సినిమా నిర్మాణానికయ్యే బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టి అంతరిక్ష ప్రయోగాల్లో భారత కీర్తి పతాకాన్ని ఎగరేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు దండిగా నిధులు కేటాయించి ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.