ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాగా.. ఇప్పుడు తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిన నారా లోకేష్ పేరును ఏ-14 నిందితుడిగా చేర్చారు. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ-14గా తన పేరును చేర్చడం తనకు జగన్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటానని చెప్పిన లోకేష్.. తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యతను వ్యక్తిగతంగా తాను తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. త్వరలోనే తాను యువగళం పాదయాత్ర ప్రారంభించబోతున్నట్టు ప్రకటించగానే.. దాన్ని అడ్డుకునేందుకు ఇలా సంబంధమే లేని కేసులో తన పేర్లు పెడుతున్నారని లోకేష్ చెప్పుకొచ్చారు.
ఇన్నర్ రింగ్ రోడ్డుతో తనకేం సంబంధం అని లోకేష్ ప్రశ్నించారు. అసలు అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డే లేదని.. అలాంటిది రెండేళ్లపాటు విచారించి తనను నిందితుడిగా చేర్చటమేంటన్నారు. స్కిల్ స్కాంకు తనకు సంబంధం ఏంటని.. ఫైబర్ గ్రిడ్‌కు తనకు ఎలాంటి సంబంధమేంటంటూ ప్రశ్నించారు. ఇలాంటి కేసులకు తాము భయపడేది లేదని చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో ఎలాంటి స్కాం జరగలేదని.. తమ కుటుంబానికి ప్రజల సొమ్ము అవసరం లేదంటూ లోకేష్ తెలిపారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌పై జాతీయస్థాయిలో ఉన్న మిగతా పార్టీల నేతలను, లాయర్లను కలుస్తున్నట్టు లోకేష్ చెప్పుకొచ్చారు. అయితే.. ఏపీలో కొనసాగుతోన్న అరాచక పాలనను మిగతాపార్టీల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే తనను అడ్డుకునేందుకు ఇలాంటి రూమర్లు పుట్టిస్తున్నారని లోకేష్ చెప్పుకొచ్చారు. ఈ అరాచక పాలనను అంతమొందించేందుుకు.. యువగళం పేరుతో తాను పాదయాత్ర చేస్తున్నానని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర చేస్తున్నట్లు వివరించారు. ప్రతిపక్షాలు రోడ్డు ఎక్కకూడదన్న దురుద్దేశంతోనే.. వైసీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.
ఇదిలా ఉంటే.. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని.. దీనిపై స్పందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును లోకేష్ కలిశారు. లోకేష్‌తో పాటు టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు కలిశారు. కక్ష సాధింపులో భాగంగానే.. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని, నిబంధనలు పాటించకుండా అరెస్ట్ చేశారని రాష్ట్రపతి దృష్టికి వివరించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేవలం అవినీతి బురదజల్లే లక్ష్యంతో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ అంశంపై స్పందించి.. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రపతిని నారా లోకేష్ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa