ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏ14 నిందితుడిగా చేరుస్తూ ,,,నారా లోకేష్‌పై సీఐడీ కేసు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 26, 2023, 07:26 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంటు కేసులో నారా లోకేష్‌ను 14వ నిందితుడిగా చేరుస్తూ సీఐడీ కోర్టులో మెమో ఫైల్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబును సీఐడీ అధికారులు ఏ1గా చేర్చిన సంగతి తెలిసిందే. అలాగే మాజీ మంత్రి నారాయణ ఏ2గా ఉన్నారు.. ఇప్పుడు లోకేష్ పేరు కూడా చేర్చడంతో అరెస్ట్ తప్పదా అనే చర్చ జరుగుతోంది. అంతేకాదు ఫైబర్ నెట్, స్కిల్ డెవలెప్‌మెంట్ కేసుల్ో కూడా చంద్రబాబు పేరు ఉందని సీఐడీ గతంలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే.


నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అక్కడ సీనియర్ లాయర్లతో చంద్రబాబు క్వాష్ పిటిషన్ సహా ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. అయితే గతవారం నారా లోకేష్‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఈ క్రమంలో లోకేష్ మధ్యలో ఆగిపోయిన యువగళం పాదయాత్రను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. వచ్చే నెలలో యాత్ర ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో లోకేష్ పేరు కూడా ఉండటంతో.. ఢిల్లీ నుంచి రాగానే సీఐడీ అరెస్ట్ చేస్తుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.


ఇప్పటికే చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో జైల్లో ఉన్నారు. ఒకవేళ లోకేష్‌ను కూడా సీఐడీ అరెస్ట్ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేది చూడాలి. అయితే టీడీపీ ఇప్పటికే పొలటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఆదేశాలతో 14 మంది సభ్యుల్ని కమిటీలోకి తీసుకున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ కమిటీ కార్యక్రమాల్ని, నేతల్ని సమన్వయం చేసుకోవడంతో పాటు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ.. పార్టీకి మద్దతుగా వచ్చే రాజకీయ, ప్రజాపక్షాలతో ఈ కమిటీ నిరంతరం సంప్రదింపులు జరపనుంది. పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయనుంది.


టీడీపీ ఏర్పాటు చేసిన కమిటీలో యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంఏ షరీష్, పయ్యావుల కేశవ్, నందమూరి బాలకృష్ణ, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనంద్‌బాబు, కాలువ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్థనరెడ్డి, వంగలపూడి అనిత, బీద రవిచంద్రయాదవ్, నారా లోకేశ్‌లు సభ్యులుగా ఉన్నారు. అటు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా రాజమహేంద్రవరంలోనే ఉన్నారు. మరి తాజా పరిణామాలపై టీడీపీ స్పందించాల్సి ఉంది.


మరోవైపు నారా లోకేష్ జగన్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనల మాట వింటేనే జగన్ ఉలిక్కి పడుతున్నారని.. రోడ్డెక్కిన అంగన్ వాడీలపై అంత కర్కకశమా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో దమనకాండను ప్రజలు అంతా గమనిస్తున్నారు.. త్వరలోనే ఈ ప్రభుత్వానికి పాడెకడతారు అంటూ ఘాటుగా స్పందించారు. 'రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై సిఎం జగన్ అణిచివేత వైఖరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. జనం రోడ్డెక్కితే సిఎం జగన్ జడుసుకుంటున్నాడు. నిరసనల మాట వింటే ఉలిక్కి పడుతున్నాడు. ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ప్రశ్నించే గళాలను చూసి భయపడుతోంది. చంద్రబాబు అరెస్టుపై, తమ హక్కుల కోసం పోరాడుతున్న వివిధ వర్గాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జగన్ పిరికితనాన్ని చాటిచెపుతోంది అని లోకేష్ అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలు చేపట్టిన అంగన్ వాడీలపై నిన్న పోలీసుల నిర్బంధం తీరు నిర్ఘాంతపరిచిందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన ఆ మహిళపై అంత కర్కశంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటో అర్ధం కావడం లేదు. ప్రజాస్వామ్యంలో నిరసనలు, వ్యతిరేక గళాలు ఉంటాయన్న విషయం జగన్ తెలుసుకోవాల్సి ఉంది. అలాగే చంద్రబాబు అక్రమ అరెస్టుపై రాష్ట్రంలో నిరసనలకు దిగిన మహిళలు, నేతలపై పోలీసుల దమనకాండను ప్రజలంతా గమనిస్తున్నారు. అతి త్వరలోనే వైసీపీ ప్రభుత్వానికి పాడెకడతారు' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa