చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ కార్యాలయానికి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు తాళం వేసిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలో పాల్గొన్న వారికి అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పురపాలక ఛైర్మన్ సుధీర్ తెలిపారు. అంతేకాదు పార్టీ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా కౌన్సిలర్ సయ్యద్ అలీ, కౌన్సిలర్ లావణ్య భర్త సురేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుప్పం మున్సిపాలిటీలోని వార్డుల్లో అభివృద్ధి పనులు జరగడం లేదంటూ సోమవారం ఐదుగురు కౌన్సిలర్లు, మరో ఐదుగురు కౌన్సిలర్లకు సంబంధించి భర్తలు, కొడుకులు కలిసి మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కౌన్సిలర్లను హెచ్చరించి తాళాలు తీశారు. ఇలా కార్యాలయానికి తాళాలు వేయడం నేరమని.. ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అయితే మంగళవారం పార్టీ నుంచి ఇద్దర్ని సస్పెండ్ చేయడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అలాగే మిగిలిన కౌన్సిలర్లు షోకాజ్ నోటీసులకు ఎలాంటి సమాధానం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో గెలవాలని వైఎస్సార్‌సీపీ అధిష్టానం పట్టుదలతో ఉంటే.. ఇక్కడ మాత్రం పరిస్థితి వేరేగా ఉందనే చర్చ జరుగుతోంది.
మరోవైపు కుప్పం ఎపిసోడ్‌పై టీడీపీ స్పందించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. కుప్పం మున్సిపాలిటీలో ఏ ఒక్క అభివృద్ది పనికూడా జరగలేదని ఆరోపిస్తూ అధికార పార్టీకే చెందిన కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేసి మరీ నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రజలకు వాస్తవాన్ని తెలియజెప్పినందుకు ఆ కౌన్సిలర్లకు ఎమ్మెల్సీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రి పెద్దిడ్డి, ఎమ్మెల్సీ భరత్ చెబుతున్న రూ.66 కోట్లు ఏమయ్యాని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ప్రతి ఒక్క అభివృద్ధి పనీ, పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా కుప్పంలో చంద్రబాబు అమలు చేసేవారన్నారు. ఇప్పుడు అసలు వీసమెత్తు అభివృద్ధి కూడా జరగలేదంటూ అధికార పార్టీ వారే నిరసన వ్యక్తం చేయడం ద్వారా రాష్ట్రం మొత్తానికి తెలియజెప్పారన్నారు. టీడీపీది అభివృద్ధి అజెండా అన్నారు. అభివృద్ధి జరగలేదని నిరసన వ్యక్తం చేసిన కౌన్సిలర్లను అధికార పార్టీ నుంచి ఆ పార్టీ నాయకులు సస్పెండ్ చేయడం విచిత్రంగా ఉందన్నారు. అధికార పార్టీ అక్రమాలను ప్రశ్నిస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా వెనుకాడేది లేదన్నారు. ప్రజాక్షేత్రంలో రాష్ట్ర అభివృద్ధి కోసం, చంద్రబాబు కోసం కడదాకా పోరాడి విజయం సాధిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa