దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు పార్టీలు, ఇటు అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. టికెట్లు దక్కుతాయా.. అసలు టికెట్లు దక్కితే ఎన్నికల్లో విజయం సాధిస్తామా.. ఒక వేళ తమ సీటులో గెలిచినా.. తమ పార్టీ అధికారంలోకి వస్తుందా అంటూ రకరకాల లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ బీజేపీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆసక్తికరంగా మారాయి. శాసనసభ ఎన్నికల్లో తనకు పార్టీ టికెట్ కేటాయించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లో చాలా సీనియర్ నేతను అని.. ఇప్పుడు తనకు టికెట్ ఇస్తే ఓటర్ల వద్దకు వెళ్లి చేతులు కట్టుకుని ఓట్లు అడగాలా అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మాజీ మంత్రిగా కూడా పనిచేయడం గమనార్హం.
మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రచారం ప్రారంభమైంది. ఎన్నికల కోసం పార్టీలు, అభ్యర్థులు తీవ్ర తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ.. రెండో విడతలో భాగంగా 39 మంది అభ్యర్థులతో మరో జాబితాను విడుదల చేసింది. ఇందులో ఇండోర్ -1 అసెంబ్లీ సీటులో బీజేపీ సీనియర్ నేత కైలాష్ విజయవర్గీయ పేరు కూడా ఉంది. అయితే ఈ జాబితాపై తాజాగా స్పందించిన కైలాష్ విజయవర్గీయ.. అభ్యర్థుల జాబితాలో తన పేరు చూసి షాక్ అయినట్లు వెల్లడించారు. ఏదో ఎన్నికల సభల్లో ప్రసంగించి పార్టీ తరఫున ప్రచారం చేయాలని భావించానని పేర్కొన్నారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక శాతం ఆసక్తి కూడా లేదని మంగళవారం నిర్వహించిన ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
67 ఏళ్ల కైలాష్ విజయవర్గీయ.. తనకు సీటు కేటాయించడం పట్ల సంతోషంగా లేనని వ్యాఖ్యానించారు. తాను ఇప్పుడు పార్టీలో సీనియర్ నాయకుడిని అని.. అలాంటి వ్యక్తిని ఇప్పుడు చేతులు కట్టుకుని ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతానా అని ప్రశ్నించారు. కైలాష్ విజయవర్గీయ గతంలో ఇండోర్ సిటీ మేయర్‌గా, మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. వీటితోపాటు బీజేపీలో సీనియర్ పదవులను కూడా చేపట్టారు. ఆయన కుమారుడు ఆకాష్ ప్రస్తుతం ఇండోర్-3 నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే తాను 8 బహిరంగ సభల్లో ప్రసంగించేందుకు ప్రణాళికలు చేసుకున్నానని.. ఇందులో ఐదు సభలకు హెలికాప్టర్లలో మరో మూడింటికి కారులో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తనకు టికెట్ కేటాయించారని ఇప్పటికీ నమ్మలేకపోతున్నట్లు వివరించారు.
అయితే ఈ వ్యాఖ్యల తర్వాత మీడియాతో మాట్లాడిన విజయవర్గీయ.. తనను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ ఎంపిక చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. పార్టీ పెట్టుకున్న అంచనాలను నెరవేర్చడానికి తాను ప్రయత్నిస్తానని చెప్పారు. ప్రస్తుతం ఇండోర్ 1 నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన సంజయ్ శుక్లా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అధికార బీజేపీ సరికొత్త ప్రణాళికలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఏడుగురు ఎంపీలను ప్రస్తుత అసెంబ్లీ బరిలోకి దింపుతోంది. వారిలో ముగ్గురు కేంద్ర మంత్రులు ఉండటం విశేషం. అయితే ప్రస్తుత మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ పేరు ఇప్పటివరకు ప్రకటించిన రెండు జాబితాల్లో లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ ప్రభుత్వం ఓడిపోతుందన్న భయంతోనే బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. ఒక సీఎం, ఏడుగురు ఎంపీలు అందులో ముగ్గురు కేంద్రమంత్రులు ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓటమిని ఆపలేరని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa