టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ హైకోర్టులో ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.. దీనిపై మధ్యాహ్నం విచారణ చేపట్టే అవకాశం ఉంది. లోకేష్ మరో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. 41A నోటీసులో సీఐడీ పేర్కొన్న నిబంధనలపై లోకేష్ అభ్యంతరం తెలిపారు. హెరిటేజ్ తీర్మానాలు.. అకౌంట్ బుక్స్ తీసుకురావాలనడంపై అభ్యంతరం తెలిపారు. ఇతర నిబంధనలపై లోకేష్ అభ్యంతరం చెప్పారు. ఈ పిటిషన్‌పైనా మధ్యాహ్నం విచారణ జరిగే అవకాశం ఉంది.
మరోవైపు మాజీ మంత్రి నారాయణ కూడా ఏపీ హైకోర్టులో నారాయణ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ ఇచ్చిన నోటీసుల్ని బట్టి బుధవారం విచారణకు హాజరుకాలేనని పిటిషన్‌లో వెల్లడించారు. సీఐడీ గైర్హాజరుకు అనుమతించాలని నారాయణ విజ్ఞప్తి చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణకు సంబంధించి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 60 ఏళ్ల వయస్సు వచ్చింది కాబట్టి స్టేషన్‌కు రాలేనని.. పోలీసులే ఇంటికి వచ్చి విచారణ జరపాలంటూ లంచ్ మోషన్‌లో కోరారు.
అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు హాజరయ్యేందుకు లోకేష్ బుధవారం విజయవాడ వస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ ఢిల్లీ వెళ్లిపోయారు. అక్కడ సీనియర్ లాయర్లతో న్యాయ పోరాటంపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే లోకేష్‌ను అమరావతి ఇన్నిర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా చేరుస్తూ సీఐడీ కోర్టులో మెమో దాఖలు చేసింది. లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా.. 41ఏ కింద నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో సీఐడీ అధికారులు ఢిల్లీ వెళ్లి లోకేష్‌కు నోటీసులు జారీ చేశారు.. బుధవారం విచారణకు రావాలని పేర్కొన్నారు. దీంతో విచారణకు హాజరుకానున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నారా లోకేష్‌కు స్వల్ప ఊరట దక్కింది. ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 4వరకు లోకేష్‌ను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్ట్ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గత శుక్రవారం ఉదయమే బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా పరిశీలించిన అనంతరం హైకోర్ట్ ఈ ఆదేశాలిచ్చింది. ఇప్పుడు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుంది అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. అలాగే బుధవారం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్‌ను సీఐడీ ప్రశ్నించనుంది.