డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కలకలంరేపిన దారి దోపిడీ కేసును పోలీసులు చేధించారు. గత నెల 29న ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి ఈదరపల్లి వెళ్లే దారిలో ఇద్దరు యువకులు చెరో బైక్‌పై వెళ్తున్నారు. రాత్రి సుమారు 11:15 గంటల సమయంలో వెనుక నుంచి మూడు బైక్‌లపై ఐదుగురు యువకులు వచ్చారు. బైక్‌లపై వెళుతున్న ఇద్దరు యువకుల్ని ఆపారు.. ఎలాంటి కారణం లేకుండానే వారితో గొడవపడి బైక్‌ల తాళాలు లాగేసుకున్నారు. వారిని బూతులు తిట్టి కావాలని వారితో గొడవ పెట్టుకొని ఐదుగురు కలిసి ఇనుప రాడ్‌లతో దాడి చేశారు.
ఇద్దరు యువకుల్ని బెదిరించి వారి దగ్గరున్నరూ.4,300 డబ్బుల్ని బలవంతంగా లాక్కున్నారు. ఇద్దరి బైక్ అద్దాలను పగలగొట్టి బెదిరించి పరారయ్యారు. ఈ ఘటనపై గత నెల 30న మధ్యాహ్నం బాధిత యువకుల్లో ఒకరు ఫిర్యాదు చేయడంతో అమలాపురం టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ ఘటనలో ఐదుగురు యువకులను గుర్తించి సోమవారంసాయంత్రం అరెస్ట చేశారు. అమలాపురం మండలం చిందాడ గరువుకు చెందిన బొంతు నవీన్ కుమార్, అమలాపురం మెట్ల కాలనీకి చెందిన ముత్తాబతుల వెంకటేష్, అమలాపురం బాలయోగి కాలనీకి చెందిన పరమట రమేష్, అమలాపురం మండలం జనుపల్లికి చెందిన దండంగి సంపత్ కుమార్, ఐనవిల్లి మండలం సిరిపల్లికి చెందిన కురస విష్ణు సూర్యలను పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెసైన ఐదుగుర్ని అమలాపురం ఏజేఎఫ్ సీఎం కోర్టులో మంగళవారం హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఎవరైనా ఇలా చట్ట వ్యతిరేక, దౌర్జన్య కార్యక్రమాలకు పాల్పడే ఆకతాయి లు ఎవరైనా సరే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రాత్రి వేళల్లో ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.