చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ నారా, నందమూరి కుటుంబాలు దీక్షలు చేపట్టాయి. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో చేస్తున్న దీక్షల్లో నందమూరి బాలయ్య సతీమణి వసుంధర, నందమూరి కుటుంబ సభ్యులు, దివంగత తారకరత్న భార్య అలేఖ్య, కుమార్తె నిష్క పాల్లొన్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటికొచ్చే వరకు కుటుంబ సభ్యులుగా తాము చేయాల్సిందంతా చేస్తామన్నారు అలేఖ్య.చంద్రబాబు కోసం చేస్తున్న పోరాటాన్ని చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు నిష్క. తన వంతుగా మద్దతు తెలిపేందుకు వచ్చానన్నారు.
తారకరత్న కూడా తమతోనే ఇక్కడే ఉన్నారని భావిస్తున్నాను అన్నారు అలేఖ్య. ఆయన పార్టీకి ఏ అవసరం వచ్చినా, ఎవరు పిలిచినా వెళ్లేవారని.. కుటుంబం ఎంతో ఇష్టమన్నారు. తాతగారంటే ప్రాణమని.. చంద్రబాబు ఆలోచన తీరు, ఆయన దార్శనికతను తారకరత్న ఇష్టపడేవారన్నారు. ఆ తర్వాత చంద్రబాబు అడుగుజాడల్లో తారకరత్న నడిచారన్నారు. తారకరత్న ఇలా చనిపోతారని నేను అనుకోలేదని.. తమకు చాలా దురదృష్టకరమమైన పరిస్థితి అన్నారు. తారకరత్న బతికుంటే కచ్చితంగా నిరసన దీక్షలో పాల్గొనే వారని.. తారకరత్న బదులు తాను, తన కుమార్తె వచ్చామన్నారు. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టే నారా, నందమూరి కుటుంబాల వాళ్లు బయటికి రావాల్సి వచ్చిందన్నారు.
చివరి క్షణాల్లో కూడా పార్టీ కార్యక్రమానికి వెళ్లారని.. చివరి వరకు పార్టీ అంటేనే ప్రాణంగా ఉన్నారన్నారు. తారకరత్న స్థానంలో ఆ కుటుంబంలో సభ్యురాలిగా చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నామన్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చే వరకు మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి తమ పోరాటం కొనసాగుతోంది అన్నారు. తారకరత్న సతీమణి అలేఖ్య, ముగ్గురు పిల్లలు చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా తమ నిరసనను వ్యక్తం చేశారు. అలాగే ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న సమయంలో ఆ ర్యాలీని ప్రారంభించారు.