తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండులో రెండేళ్ల బాలుడు కిడ్నాప్ కలకలంరేపింది. చెన్నైలోని వరసవక్కంకు చెందిన రామస్వామి చంద్రశేఖర్ కుటుంబం సోమవారం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంది. తిరుమల నుంచి తిరుపతికి చేరుకున్నారు.. తన భార్య.. ఇద్దరు కుమారులతో తిరుపతి బస్టాండులో చెన్నై బస్సులకోసం ఫ్లాట్ ఫామ్ నంబర్ 3కు వచ్చారు. బస్సులు లేకపోవడంతో అక్కడే నేలపై పడుకున్నారు.
అందరూ నిద్రలోకి జారుకున్నారు.. మధ్యలో మెలకువ వచ్చి చూస్తే వారి కుమారుడు కనిపించలేదు. రెండేళ్ల చిన్న కుమారుడు అరుల్ మురుగున్ కనిపించకపోవడంతో. కంగారుపడి బస్టాండ్ మొత్తం తిరుగుతూ.. కనిపించినవాళ్లను అడుగుతూ వెళ్లారు. ఎక్కడా ఆచూకీ కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఓ వ్యక్తి బాబును ఎత్తుకుని వెళ్లాడు. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.. వెంటనే బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.
అర్థరాత్రి 2 గంటలకు బాలుడు కిడ్నాప్ గురైనట్లు చెబుతున్నారు. బాలుడితో పాటు కిడ్నాపర్ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సర్కిల్ దగ్గర కేన్సస్ హోటల్ వైపు వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ కిడ్నాప్ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.