నేను రాజకీయంగా మంత్రిగా ఎదిగితే.. చూసి ఓర్వలేక నాపై అనుచిత వాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి ఆర్కే రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. టీడీపీలో నచ్చక బయటకొస్తే తనను టార్చర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దేశమంతా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చర్చించి చట్టసభల్లో ఆమోదించినందుకు సంతోషించాలా..బండారు లాంటి వారి మాటలు చూసి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న మహిళలు భయపడి ఆగిపోవాలా అనేది అర్ధం కాని పరిస్థితి. మన దేశంలో మహిళలను గౌరవించమని చిన్నప్పటి నుంచీ తల్లిదండ్రులు నేర్పుతారు. కానీ బండారు సత్యనారాయణమూర్తి మాటలు విని అతని తల్లిదండ్రులు కూడా తలవంచుకుంటారు.ఒక మహిళా మంత్రిగా మహిళల కోసం ఎన్నో పోరాటాలు చేసిన నన్ను ఎంత నీచంగా మాట్లాడారో చూశారు. అది విన్న వారు ఎవరైనా బండారు సత్యనారాయణమూర్తిని చెప్పుతో కొట్టకుండా ఊరుకోరు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలోని మహిళలు స్వాగతిస్తున్నారు..సంతోషిస్తున్నారు. కానీ టీడీపీలోని వారు మాత్రం దాన్ని ఖండిస్తున్నామంటే చాలా బాధేస్తుంది అని అన్నారు.