టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. బెయిల్, కస్టడీ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వివిపించారు. స్కిల్ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవన్నారు. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారని తెలిపారు. సునీత అధ్యయనం చేసి.. ఎలాంటి అభ్యంతరం సీమెన్స్ ప్రాజెక్టుకు తెలపలేదన్నారు. సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న విషయమై ఆధారాలు ఉన్నాయని దూబే అన్నారు. కాస్ట్ ఎవాల్యూయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్మెంటు ధరను నిర్దారించిందన్నారు. ఆ కమిటీలో చంద్రబాబు లేరని తెలిపారు. ఆ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఉన్నారని దూబే తెలిపారు. ఆయన బెయిల్‌ను సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకూ పొడిగించిందన్నారు. చంద్రబాబుకు ఎలాంటి నోటీసివ్వకుండా అరెస్ట్ చేశారన్నారు. అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేపట్టారని పేర్కొన్నారు. ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేపట్టారన్నారు. ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారని.. అవసరం ఏముందని ప్రశ్నించారు. కెబినెట్ ఆమోదం పొందిన తర్వాతే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చిందన్నారు. కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబు మీద కేసు ఎలా పెడతారని దూబే ప్రశ్నించారు.