జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు ఇచ్చారు. మంగళవారం రోజు పవన్ చేసిన ఆరోపణలకు ఏవైనా సాక్ష్యాలు ఉన్నాయా అని నోటీసులు ఇచ్చామని ఎస్పీ జాషువా తెలిపారు. తాము ఇచ్చిన నోటీసుపై ఇంకా సమాధానం రాలేదన్నారు.. అంటే దీనిని బట్టి నిరాధారమైన ఆరోపణలు చేశారని భావించాలా? అని ప్రశ్నించారు. ‘పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అందుకే నోటీసులు ఇచ్చాం. దాడులు జరగుతాయనే సమాచారం మీకు ఎక్కడి నుంచి వచ్చిందనేది మాకు తెలియపర్చమని కోరాం. మేం పంపిన నోటీసులకు పవన్ నుంచి ఎలాంటి రిప్లై లేదు. రిప్లై రాలేదంటే ఆయన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారాని అనుకోవాలా?. ఎటువంటి సమాచారంతో మాట్లాడారు. సరైన ఆధారాల్లేకుండా వ్యాఖ్యలు, ఆరోపణలు చేయకూడదు.బాధ్యతారాహిత్యంగా ఆరోపణలు చేస్తే పర్యవసానాలు ఉంటాయి. రెచ్చగొట్టే భాష, సైగలు మానుకుని మాట్లాడాలి. మా సమాచార వ్యవస్థ మాకుంది. పవన్ కంటే నిఘా వ్యవస్థ మాకు బలంగా ఉంది. అసాంఘిక శక్తులుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం’ అన్నారు ఎస్పీ జాషువా.
ఇవాళ కృష్ణాజిల్లా పెడనలో జరిగే వారాహి విజయయాత్రను అడ్డుకునేందుకు రెండువేల మంది అసాంఘిక శక్తులను దించినట్లు సమాచారం వచ్చిందని పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. వారాహి విజయయాత్రను అడ్డుకోవాలని, అల్లర్లు సృష్టించాలని కుట్ర పన్నుతున్నారని జనసేనాని ఆరోపించారు. ఎలాంటి గొడవలు జరిగినా.. ఆ తర్వాత తీవ్ర పరిణామాలకు సీఎం జగన్, హోం మంత్రి, డీజీపీ, డీఐజీలు, జిల్లా ఎస్పీలు బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నారు. అవనిగడ్డ సభలో కూడా జనసేన, టీడీపీ కేడర్‌కు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారని.. పెడన సభలో కూడా అరాచకశక్తుల్ని దించుతారన్నారు. పెడన సభలో రాళ్లు విసిరే అవకాశం ఉంది. కత్తులు, కటార్లు తీసే అవకాశం ఉందని ఆరోపిచారు.
వారిని చుట్టుముట్టి పట్టుకోవాలని.. పోలీసుస్టేషన్‌లో అప్పగిద్దామని జనసైనికులకు పిలుపునిచ్చారు. వారు 2వేల మందే.. జనసైనికులు ప్రతి దాడికి పాల్పడవద్దు అన్నారు. చట్టాన్ని గౌరవిద్దాం.. గొడవలు పెట్టుకోవద్దు అన్నారు. గొడవలు కావాలంటే.. ఆ పరిస్థితి వేరేలా ఉంటుందన్నారు. అమలాపురంలోనూ అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేశారని.. కొందరు గూండాలను పంపించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారన్నారు.
రాష్ట్ర సుస్థిరత కోసం టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామన్నారు.. టీడీపీ, జనసేన పొత్తును విచ్చిన్నం చేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని అరాచకశక్తులు కుట్రలు పన్నుతున్నాయన్నారు. పులివెందుల రౌడీయిజాన్ని సహించం.. వారి చేతులు కట్టి చట్టం ముందు నిలబెడతామన్నారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే సహించేది లేదన్నారు. ఇవాళ పెడనలో భారీ బహిరంగ సభ తలపెట్టారు. బంటుమిల్లి రోడ్డులో సభ నిమిత్తం ఏర్పాట్లు చేశారు. పవన్ వ్యాఖ్యలతో.. ఈ సభకు పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.