పామును చూస్తేనే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఇక అది నాగు పాము అయితే దాని వంక చూడటానికి కూడా వణికిపోతారు. ఎక్కడ అది కాటేస్తుందో.. ఎక్కడ పగబడుతుందోనని బెదిరిపోతూ ఉంటారు. అయితే పాము కాటు వేస్తే ఆ బాధితులను ఆస్పత్రికి తరలించడం మనం సర్వ సాధారణంగా చూస్తూనే ఉంటాం. పరిస్థితి విషమిస్తే పై ఆస్పత్రికి వెళ్లైనా సరే వారిని బతికించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం నాగు పామును కాపాడేందుకు ఇద్దరు వ్యక్తులు పడిన కష్టం ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. గాయపడిన ఓ పాముకు చికిత్స చేయించేందుకు ఏకంగా దేశ రాజధాని ఢిల్లీకి దానిని అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కాటుకు చనిపోవటం లేదా కాటు తర్వాత ఆస్పత్రికి పరిగెత్తటం చూశాం.. ఇది అందుకు భిన్నం.. ఇక్కడ నాగుపాము గాయపడింది.. దాన్ని అంబులెన్స్ లో అత్యవసరంగా ఢిల్లీకి తరలించారు వైల్డ్ లైఫ్ ప్రతినిధులు.. అవును.. ఇది నిజం.. మనుషులు చస్తుంటేనే అంబులెన్సులు రావటం లేదు.. ఇక పామును అంబులెన్స్ లో అత్యవసరంగా తరలించటమా అనే డౌట్ రావొచ్చు.. ఇది మన దేశంలోనే జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే...
ఉత్తరప్రదేశ్ బదౌన్ జిల్లాలోని ఓ హార్డ్‌వేర్ షాప్‌లోకి ఒక నాగు పాము చొరబడింది. అయితే అది గమనించని ఆ దుకాణంలోని వ్యక్తి తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఒక భారీ ఇనుప వస్తువును తీయడానికి ప్రయత్నిస్తుండగా.. అతని కంటికి ఒక నాగు పాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన ఆ వ్యక్తి ఆ ఇనుప వస్తువును కింద పడేశాడు. దీంతో ఆ వస్తువు కాస్త ఆ నాగు పాముపై పడింది. ఈ ఘటనలో ఆ నాగు పాముకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ విషయం తెలుసుకుని జంతు ప్రేమికుడు, పీఎఫ్‌ఏ జిల్లా అధ్యక్షుడు వికేంద్ర శర్మ హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లారు. ఇనుప వస్తువు పడటంతో తీవ్రంగా గాయపడ్డ ఆ నాగు పామును చూసి చలించిపోయాడు. వెంటనే కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి సమాచారం అందించాడు. నాగుపాము పరిస్థితి గురించి పూర్తిగా ఆమెకు వివరించాడు. దీంతో ఆ నాగు పామును ఢిల్లీకి తీసుకురావాలని దానికి మెరుగైన చికిత్స అందించాలని మేనకా గాంధీ సూచించారు. ఈ క్రమంలోనే వికేంద్ర శర్మ.. ఆ నాగు పామును అంబులెన్స్‌లో ఢిల్లీకి తరలించాడు.
అయితే తన వద్ద ఉన్న యానిమల్ లవర్ వాలంటీర్లు కావాల్సిన డబ్బును సమకూర్చినట్లు వికేంద్ర శర్మ వెల్లడించాడు. రూ. 5 వేలు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా ఒక అంబులెన్స్‌ను మాట్లాడి ఆ నాగు పామును ఢిల్లీకి తీసుకెళ్లారని చెప్పాడు. అయితే నాగుపాము కోలుకున్న తర్వాత దాన్ని అడవిలో వదిలిపెడతామని వికేంద్ర శర్మ స్పష్టం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో నాగు పాముకు చికిత్స అందించేందుకు సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల దాన్ని ఢిల్లీలోని వైల్డ్‌లైఫ్ ఎస్‌ఓఎస్ సెంటర్‌కు పంపించాల్సి వచ్చిందని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అశోక్ కుమార్ చెప్పారు. పీపుల్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్‌ఏ) వాలంటీర్లు గాయపడిన నాగుపామును ఎస్‌ఓఎస్ సెంటర్‌కు తీసుకెళ్లారని తెలిపారు.