ఏపీలో అక్కడక్కడా వర్షాలు పడతున్నాయి. మంగళవారం గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది అన్నారు. తిరుపతి జిల్లా పాకాలలో 59.4 మిల్లీ మీటర్లు, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో 34.2, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 9.9, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 6.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లాలో ఆదివారం ఉదయం 8 నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు ఏడు మండలాల్లో వర్షం కురిసింది. రొంపిచెర్లలో 78 మి.మీలు, పులిచెర్లలో 48.6, పెద్దపంజాణిలో 30, వెదురుకుప్పంలో 14.6, బైరెడ్డిపల్లెలో 6.2, శాంతిపురంలో 02, తవణంపల్లెలో 1.2 మిమీల వర్షపాతం నమోదైంది. మరోవైపు కొన్ని జిల్లాల్లో మాత్రమే తేలికపాటి వానలు పడుతున్నాయి. కానీ మిగిలిన జిల్లాల్లో ఎండలు, ఉక్కపోత వాతావరణం ఉంది. దీంతో జనాలు ఇబ్బందిపడుతున్నారు.. కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ నెల 18 నుంచి 22 మధ్య ఈశాన్య రుతుపవనాలు ఏపీని తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరు, నవంబరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.