దేశంలోని చాలా సెల్‌ఫోన్లకు మంగళవారం ఉదయం వార్నింగ్ మెసేజ్ రావడంతో ఏం జరుగుతుందో తెలియక యూజర్లు తీవ్ర అయోమయంలో పడ్డారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఎమర్జెన్సీ ఫ్లాష్ మెసేజ్ రావడంతో షాక్‌కు గురయ్యారు. ఉదయం 11.35 గంటలకు ఆండ్రాయిడ్, ఐఫోన్ అని తేడా లేకుండా ఈ ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది. అయితే ఈ ఎమర్జెన్సీ అలర్ట్‌పై అధికార వర్గాలు స్పందించాయి. ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను టెస్ట్ చేసేందుకే ఈ వార్నింగ్ మెసేజ్‌లు పంపించామని.. దాని వల్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో మొబైల్ యూజర్లు ఊపిరి పీల్చుకున్నారు.
నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ డెవలప్ చేస్తున్న ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షించే క్రమంలో ఈ వార్నింగ్ అలెర్ట్ పంపించినట్లు ఎన్‌డీఎంఏ తెలిపింది. సెల్‌ఫోన్ల నుంచి భారీగా శబ్దం వస్తూ ఎమర్జెన్సీ అలర్ట్ అంటూ ఫ్లాష్ మెస్సేజ్ సెల్‌ఫోన్ స్క్రీన్‌పై కనిపించింది. ముందుగా ఒకసారి ఇంగ్లీష్‌లో వార్నింగ్ మెసేజ్ రాగా.. కొన్ని నిమిషాల తేడాతో మరోసారి హిందీలో రెండు వార్నింగ్ అలెర్ట్‌లు వచ్చాయి. ఈ ఎమర్జెన్సీ అలర్ట్‌లను సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ ద్వారా 11.30 గంటలకు ఒకసారి 11.44 గంటలకు మరోసారి అలెర్ట్ పంపించినట్లు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వెల్లడించింది.
తాము డెవలప్ చేస్తున్న టెక్నికల్ సిస్టమ్‌లో ఏవైనా లోపాలు, సమస్యలు ఉంటే వాటిని గుర్తించేందుకే ఈ మెసేజ్ పంపినట్లు తెలియజేసింది. దీని గురించి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఇది ప్రజల భద్రతను మెరుగుపరచడం, అత్యవసర సమయాల్లో హెచ్చరికలను పంపడం కోసమేనని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 15 వ తేదీన కూడా దేశంలో ఇలాంటి మెసేజ్ అందర్నీ భయపెట్టింది. చాలా మంది యూజర్స్‌కు అప్పుడు కూడా ఇలాంటి ఫ్లాష్ వార్నింగ్ అలర్ట్ వచ్చింది. జులై, ఆగస్ట్ నెలల్లో కూడా చాలా మంది యూజర్లకు ఫ్లాష్ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ వచ్చిన వెంటనే పెద్దగా బీప్ శబ్దం వినిపించింది.