ప్రముఖ ఆర్థిక వేత్త, తత్త్వవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ క్షేమంగానే ఉన్నారు. ఆయన కన్నుమూశారంటూ వస్తున్న వార్తలను ఆయన కుమార్తె నందనా దేబ్ సేన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అమర్త్యసేన్ చనిపోలేదని.. ప్రస్తుతం ఆరోగ్యంతో క్షేమంగా ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు అమర్త్యసేన్ చనిపోయారంటూ వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అయితే 89 ఏళ్ల అమర్త్యసేన్ చనిపోయారని చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఆ ట్వీట్ ఏదో సామాన్యులు చేయలేదు. ఈ ఏడాది అమెరికన్ చరిత్రకారిణి, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన క్లాడియా గోల్డిన్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. అయితే ఒక ప్రముఖమైన వ్యక్తి ఇలాంటి ట్వీట్ చేయడంతో నెటిజన్లతోపాటు మీడియా సంస్థలు నమ్మేశాయి. వెంటనే అమర్త్యసేన్ చనిపోయారంటూ వార్తలు విస్తృతమయ్యాయి. ఇక సోషల్ మీడియాలో అయితే రిప్, రెస్ట్ ఇన్ పీస్ అంటూ ట్వీట్లు, కామెంట్లు షేర్లు వెల్లువెత్తాయి. దీంతో అంతా నిజం అని భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఫేక్ వార్తలు చూసిన అమర్త్యసేన్ కుమార్తె నందనా దేబ్ సేన్.. అవన్నీ అబద్ధాలేనని స్పష్టం చేశారు.
అమర్త్యసేన్ ఇకలేరు అంటూ క్లాడియా గోల్డిన్ ట్వీట్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ‘ఒక భయంకరమైన వార్త. నాకు అత్యంత ప్రియమైన అమర్త్యసేన్ కొద్ది నిమిషాల క్రితం మరణించారు. ఇంకా చెప్పడానికి మాటలు రావడం లేదు’ అంటూ క్లాడియా గోల్డిన్ చేసిన ట్వీట్‌తో ఈ ఫేక్ వార్తలు ప్రచారం కావడం ప్రారంభమైంది. దీంతో నేషనల్ మీడియా సంస్థలు నిజమే అని నమ్మి వార్తలు పబ్లిష్ చేశాయి. అయితే అమర్త్యసేన్ కుమార్తె ఇచ్చిన క్లారిటీతో అది తప్పుడు సమాచారం అని స్పష్టం అయింది. అయితే ఇది తప్పుడు సమాచారం అని.. అది ఫేక్ ట్వీట్ అయి ఉండొచ్చని ‘ది వైర్’ కి చెందిన న్యూస్ ఎడిటర్ సీమా చిష్టి ఒక ట్వీట్ చేశారు. ఆ తర్వాత అమర్త్యసేన్ క్షేమంగా ఉన్నారని మరో ట్వీట్ చేశారు. అయితే అమర్త్యసేన్ కుమార్తెతో తాను స్వయంగా మాట్లాడానని ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారని.. మరో వార్తా సంస్థకు చెందిన ఎడిటర్ కమాలికా సేన్ గుప్తా కూడా వెల్లడించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని వారు కోరారు.