గార్డెన్ సిటీ బెంగళూరు నగరాన్ని మరోసారి వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి కురుస్తోన్న వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణం మార్పుల కారణంగా మరో రెండు రోజుల పాటు బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బెంగళూరు నగరంలో ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం కురిసిన కుండపోత వానకు నగరవాసులు బెంబేలెత్తిపోయారు. అనేక ప్రాంతాల్లో వర్షం కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం మీదుగా తమిళనాడులోని కన్యాకుమారి వరకూ 1.5 కి.మీ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో బెంగళూరు సహా కర్ణాటకలోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 11 వరకూ బెంగళూరు నగరానికి ఎల్లో అలర్ట్ జారీచేసినట్టు ఐఎండీ తెలిపింది. సోమవారం సాయంత్రం హెచ్ గొల్లహళ్లిలో అత్యధికంగా 45 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది.
కొట్టిగేపాళ్య (33 మి.మీ), నాగపుర్ (31 మి.మీ), కెంగేరిలో (30 మి.మీ), రాజరాజేశ్వరి నగర్ (28 మి.మీ), రాజమహల్ గుట్టహళ్లిలో (27 మి.మీ), నాయండహళ్లి (19 మి.మీ.), విద్యాపీఠంలో (16.5 మి.మీ), సింగసంద్రలో 16 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు చోట్ల భారీ వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షం కారణంగా కేఆర్ మార్కెట్, బీజీఎస్ ఓవర్‌పాస్, లాల్ బాగ్ సమీపంలోని ప్రధాన రహదారి, టౌన్ హాల్, కెంగేరి, రాజాజీనగర్ సహా పలు ప్రాంతాల్లో నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హంపీనగర్, విజయనగర్, మెజెస్టిక్, జయనగర పరిసర ప్రాంతాలు, హెబ్బాళ్ సమీపంలోని మాన్యత టెక్ పార్, కోరమంగళ, టిన్ ఫ్యాక్టరీ, మహదేవపుర, విద్యారణ్యపుర, నాయండహళ్లి, చామరాజ్‌పేట చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మలివాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోపెన అగ్రహార వద్ద రోడ్లపై మోకాళ్ల లోతున నీళ్లు చేరడంతో పోలీసులు తక్షణమే స్పందించారు. మోటార్ల సాయంతో వాన నీటిని బయటకు తోడి.. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. అలాగే, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం రాత్రి నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.