ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రమంగా పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు,,,,అల్పాదాయ దేశాల ప్రజలపై తీవ్ర ప్రభావం

national |  Suryaa Desk  | Published : Tue, Oct 10, 2023, 08:45 PM

ఈ శతాబ్దం ప్రారంభం నుంచి మొదలైన వాతావరణ మార్పులు గ్లోబల్ వార్మింగ్‌కు దారితీసి.. భారత్, సింధులోయ సహా ప్రపంచంలోని అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో గుండెపోటు, వడదెబ్బలకు కారణమవుతాయని తాజా పరిశోధన ఒకటి హెచ్చరించింది. పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్, పర్డ్యూ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ సైన్సెస్, పర్డ్యూ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ సంయుక్తంగా చేపట్టిన ఈ పరిశోధన ఫలితాలను ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ జర్నల్‌లో ప్రచురించారు. పారిశ్రామిక విప్లవానికి ముందు కంటే 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి భూమి వేడెక్కుతుండటం.. మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా హీట్ స్ట్రోక్ లేదా గుండెపోటు వంటి ఆరోగ్య సమస్యలకు ప్రభావితం కావడానికి ముందు మానవ శరీరాలు వేడి, తేమ నిర్దిష్ట పరిమాణాన్ని మాత్రమే తట్టుకోగలవు.


ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందు కంటే 2 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగితే పాకిస్థాన్, భారతదేశంలోని సింధు నది లోయలోని 2.2 బిలియన్ల మంది, తూర్పు చైనాలో 1 బిలియన్, సబ్-సహారా ఆఫ్రికాలో 800 మిలియన్ల మంది ప్రజలు తట్టుకోలేని తీవ్రమైన వేడిని అనుభవిస్తారని పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతలకు ప్రభావితమయ్యే నగరాలలో ఢిల్లీ, కోల్‌కతా, షాంఘై, ముల్తాన్, నాన్జింగ్, వుహాన్ వంటివి ఉన్నాయి. ఈ ప్రాంతాలు తక్కువ, మధ్య ఆదాయ దేశాలకు చెందినవి కావడం వల్ల ప్రజలకు ఏసీ లేదా శరీరాన్ని చల్లబరచడానికి ఇతర ప్రభావవంతమైన మార్గాలు అందుబాటులో ఉండకపోవచ్చని పరిశోధన తెలిపింది. పారిశ్రామిక విప్లవానికి పూర్వం కంటే గ్లోబల్ వార్మింగ్ 3 డిగ్రీల సెల్సియస్‌ మించి కొనసాగితే.. తూర్పు సముద్ర తీరం, ఫ్లోరిడా నుంచి న్యూయార్క్.. హ్యూస్టన్ నుంచి చికాగో వరకు అమెరికా మధ్య ప్రాంతం వేడి గాలులకు ప్రభావితం కావచ్చు. దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా కూడా విపరీతమైన వేడిని అనుభవిస్తాయని పరిశోధనలో గుర్తించింది.


‘కానీ, అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే అభివృద్ధి చెందిన దేశాలలోని ప్రజలకు ఈ సమస్య తక్కువగానే ఉంటుంది. కేవలం వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు ప్రాణాలు కోల్పోవచ్చు.. .అల్పాదాయ దేశాల్లో అధిక వేడి ఒత్తిడికి దారితీస్తుంది.. రాబోయే దశాబ్దాలలో జనాభా పెరుగుదలను వేగవంతం చేస్తుంది’ అని పరిశోధన కో-ఆథర్, పర్డ్యూ యూనివర్సిటీ ఎర్త్, అట్మాస్పియరిక్ అండ్ ప్లానెట్రీ సైన్సెస్ ప్రొఫెసర్ మాథ్యూ హుబెర్ అన్నారు. ‘వాస్తవంగా సంపన్న దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తున్నాయి కానీ, ఆ దేశాల్లోని బిలియన్ల మంది పేదల ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది.. చాలా మంది చనిపోవచ్చు. ఇదే సమయంలో సంపన్న దేశాలను కూడా ఈ ఉష్ణోగ్రతలు ప్రభావితం చేస్తాయి.. ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్న ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా ప్రతికూలంగా ప్రభావితమవుతారు’ అని హుబెర్ వ్యాఖ్యానించారు. ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉండాలంటే గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను, ముఖ్యంగా శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా వెలువడే కార్బన్ డయాక్సైడ్‌ను నియంత్రించాలని పరిశోధకులు సూచించారు. అలా చేయకుంటే మధ్యతరగతి, అల్పాదాయ దేశాలు ఎక్కువగా నష్టపోతాయని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com