టైటానిక్ షిప్. ఈ పేరు వింటేనే మృత్యుఘోష వినిపిస్తుంది. శతాబ్దం క్రితం సముద్రంలో మునిగిపోయిన ఈ టైటానిక్ శకలాలను చూసేందుకు ఇప్పటికీ చాలామంది సాహసం చేస్తూ అక్కడికి వెళ్లి వస్తూ ఉంటారు. అయితే టైటానిక్ సినిమా తీసిన జేమ్స్ కామెరూన్ అయితే చాలాసార్లు వెళ్లివచ్చినట్లు తెలిపారు. అయితే కొన్ని నెలల క్రితం.. టైటానిక్ షిప్‌ను చూసేందుకు వెళ్లిన ఓ టైటాన్ సబ్‌మెర్సిబుల్.. నీటి అడుగున పేలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. అయితే అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టిన అమెరికా కోస్ట్ గార్డ్.. తాజాగా టైటాన్ సబ్‌మెర్సిబుల్ చివరి అవశేషాలను కూడా వెలికి తీసింది.
మునిగిపోయిన టైటానిక్ షిప్‌ను చూసేందుకు ఐదుగురితో సముద్రంలోకి వెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ విషాదకరంగా పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ టైటాన్ చివరి భాగాలను యూఎస్ కోస్ట్ గార్డు వెలికితీసింది. టైటాన్‌కి సంబంధించి గతంలో కొన్ని భాగాలను ఉపరితలంపైకి తీసుకువచ్చారు. మిగిలిన అవశేషాలను సముద్రం అడుగు భాగాల నుంచి సేకరించినట్లు యూఎస్ కోస్ట్ గార్డు మంగళవారం తెలిపారు. వైద్య అధికారులు మానవ అవశేషాలను విశ్లేషిస్తున్నారు.
అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శిథిలాలను చూపించేందుకు ఓషన్ గేట్ అనే సంస్థ టైటాన్ అనే సబ్ మెర్సిబుల్‌ను రూపొందించింది. అయితే ఇటీవల జూన్ నెలలో ఆ టైటానిక్‌ను చూసేందుకు ఓషన్ గేట్‌కు చెందిన టైటాన్ అనే సబ్ మెర్సిబుల్‌ను పంపించింది. ఇందులో ఐదుగురు బిలియనీర్లు వెళ్లారు. అయితే అది నీటి అడుగున ఒత్తిడి తట్టుకోలేక పేలిపోయింది. అంతకుముందు ఈ ఓషన్ గేట్ సంస్థకు చెందిన టైటాన్ విజయవంతంగా టైటానిక్ వద్దకు వెళ్లి వచ్చింది. తాజాగా వెళ్లిన వారిలో బ్రిటిష్-పాకిస్తానీ వ్యాపారవేత్త షాజాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్, బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ప్రెంచ్ నేవీ డైవర్ పాల్ హెన్రీ నార్గోలెట్, ఓషన్ గేట్ కంపెనీ చీఫ్ స్టాక్ టన్ రష్ మొత్తం ఐదుగురు ప్రయాణించారు. అయితే అది మధ్యలోనే పీడనం తట్టుకోలేక పేలిపోవడంతో మృత్యువాతపడ్డారు.
సముద్రం అడుగుభాగంలోకి వెళ్లే కొద్ది నీటి ఒత్తిడి టైటాన్ సబ్‌మెర్సిబుల్‌పై పెరుగుతూనే ఉంటుంది. అయితే అందుకు తగ్గట్లుగానే దాన్ని నిర్మించారు. అయితే ఇదే టైటాన్ పేలిపోయేందుకు కారణమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒత్తిడి ఎక్కువ కావడంతో ఇన్‌ప్లోజన్ అనే పేలుడు వల్ల టైటాన్ పేలిపోయిందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ పేలుడు అనేది కొన్ని క్షణాల వ్యవధిలోనే జరిగిపోయిందని వెల్లడించారు. అయితే అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు బిలియనీర్లకు ఏం జరుగుతోందో తెలియకుండానే మరణించారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అప్పటినుంచి ఆ టైటాన్ సబ్‌మెర్సిబుల్ వెలికి తీత పనులు కొనసాగుతుండగా.. తాజాగా పూర్తిగా బయటికి తీసుకువచ్చినట్లు అమెరికా కోస్ట్ గార్డు వెల్లడించింది. అయితే అందులో ఆ ఐదుగురు బిలియనీర్లకు సంబంధించిన ఆనవాళ్లు గానీ, అవశేషాలు గానీ ఉన్నాయా అని తెలుసుకునేందుకు డాక్టర్ల బృందం పరిశీలిస్తున్నట్లు యూఎస్ కోస్ట్ గార్డు పేర్కొంది.