ఎండ, డీహైడ్రేషన్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలులో అస్వస్థతకు గురయ్యారు. ఆయన స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని జైలు ఆస్పత్రి వైద్యులు గుర్తించి... అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో గురువారం జైలు ఇన్‌చార్జి సూపరింటెండెంట్ రాజ్‌కుమార్ రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యశాల (జీజీహెచ్) సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు డెర్మటాలజిస్టులను పంపించాలంటూ కోరారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ లక్ష్మీ సూర్యప్రభ అప్పటికప్పుడు ఇద్దరు డెర్మటాలజిస్టులకు ఈ బాధ్యత అప్పగించారు. అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ డెర్మటాలజీ డాక్టర్ జి.సూర్యనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ డెర్మటాలజీ డాక్టర్ సీహెచ్‌వీ.సునీతా దేవి సాయంత్రం కారాగారం వద్దకు చేరుకున్నారు. సాయంత్రం 5.45 గంటల సమయంలో ఇద్దరు డాక్టర్లు జైలు లోపలికి వెళ్లారు. తిరిగి 6.30 గంటలకు బయటికి వచ్చారు. చంద్రబాబుకు గడ్డం, చేతులు, ఛాతీపై దద్దుర్లు వచ్చినట్లు సమాచారం. ఆయనను పరీక్షించిన వైద్యులు కొన్ని మందులు రాశారని... జైలు మెడికల్ సిబ్బంది వాటిని చంద్రబాబుకు ఇచ్చారని తెలుస్తోంది. చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని డీఐజీ రవికిరణ్ తెలిపారు.