భారత్, శ్రీలంక మధ్య ఫెర్రీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర పోర్టులు, షిప్పింగ్ అండ్ వాటర్‌వేస్ మంత్రి సర్బానంద సోనోవాల్ శనివారం ఈ ఫెర్రీ సేవలను ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జై శంకర్ సైతం ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. తమిళనాడులోని నాగపట్నం, శ్రీలంకలోని కనకేసంతురాయ్ మధ్య ఈ ఫెర్రీ రాకపోకలు సాగించనుంది. ఈ ఫెర్రీ సర్వీసు భారత్, శ్రీలంకలను మరింత దగ్గర చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పర్యాటకం, ప్రజా సంబంధాలు మెరుగవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల్లోని యువతకు ఈ ఫెర్రీ సర్వీసు ద్వారా అవకాశాలు మెరుగవుతాయన్నారు. 2015లో ఢిల్లీ, కొలంబో మధ్య నేరుగా విమాన సేవలు ప్రారంభమయ్యాయన్న మోదీ.. తర్వాత శ్రీలంక నుంచి తొలి అంతర్జాతీయ విమానం ఖుషీనగర్‌లో ల్యాండయ్యిందన్నారు. ఈ దిశగా నాగపట్నం, కనకేసంతురాయ్ మధ్య ఫెర్రీ సర్వీసు మరో ముఖ్యమైన ముందడుగన్నారు.
ఫెర్రీ సర్వీసుల ప్రారంభం సందర్భంగా శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య అనుసంధాన్ని పెంచండలో ఇది కీలక ముందుడుగుగా అభివర్ణించారు. (శ్రీలంక) ఉత్తర ప్రాంతంలో యుద్ధం కారణంగా ఫెర్రీ సర్వీసులకు అంతరాయం కలిగిందన్న విక్రమసింఘే.. ఇప్పుడు అక్కడ శాంతి నెలకొనడంతో ఫెర్రీ సర్వీసులను పునఃప్రారంభిస్తున్నామన్నారు. నాగపట్నం, కనకేసంతురాయ్ మధ్య 111 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 40 ఏళ్ల క్రితం వరకూ ఇరు ప్రాంతాల మధ్య ఫెర్రీ సర్వీసులు నడిచేవి. కానీ ఎల్టీటీఈతో యుద్దం కారణంగా ఫెర్రీ సేవలను నిలిపేశారు. నాగపట్నంలో ఫెర్రీ మూడు గంటల సముద్రంలో ప్రయాణిస్తే శ్రీలంకకు చేరుకోవచ్చు. ఇందుకోసం టికెట్ ధరను జీఎస్టీతో కలుపుకొని రూ.7670గా నిర్ణయించారు. కానీ ప్రమోషనల్ ఆఫర్‌గా ఇవాళ ఒక్కరోజు (అక్టోబర్ 14న) ఒక్కో టికెట్‌కు రూ.2800 మాత్రమే వసూలు చేస్తున్నారు. అక్టోబర్ 10నే ఈ ఫెర్రీ సేవలు ప్రారంభం కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల అక్టోబర్ 14కి వాయిదా వేశారు.