టీడీపీ నేత, నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కిలారు రాజేష్‌ను నిందితుడిగా చేర్చలేదని.. ఒకవేళ చేరిస్తే సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం నోటీసు ఇచ్చి ప్రశ్నిస్తామని సీఐడీ హైకోర్టుకు తెలిపింది. ఆ వివరాలను నమోదు చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేష్ రెడ్డి.. రాజేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌పై విచారణను మూసివేశారు. ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. స్కిల్ కేసులో సాక్షిగా ఈ నెల 16న తమ ముందు హాజరుకావాలని రాజేష్‌కు సీఐడీ నోటీసు ఇచ్చింది. తనను అరెస్టు చేస్తారనే ఆందోళనతో ముందస్తు బెయిలు కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. నిధుల మళ్లింపులో తన ప్రమేయం ఉన్నట్లు సీఐడీ ఏడీజీ మీడియాతో చెప్పారని కోర్టులో ప్రస్తావించారు. విచారణ సందర్భంగా సీఐడీ తనను అరెస్టు చేస్తుందనే ఆందోళన ఉందన్నారు. శుక్రవారం విచారణలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు, న్యాయవాది మేడమల్లి బాలాజీ వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున వివేకానంద కోర్టుకు వివరాలు సమర్పించారు.