9 నెలలు నిండి ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లిన ఆ గర్బిణీ పట్ల డాక్టర్లు, వైద్య సిబ్బంది మానవత్వం లేకుండా ప్రవర్తించారు. గర్బిణీకి ఎయిడ్స్ ఉందని ఆమెకు డెలివరీ చేయడానికి నిరాకరించారు. వైద్యం చేయాల్సిన డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలే ఆ గర్భిణీ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. ఓ వైపు గర్బిణీకి నొప్పులు తీవ్రం అవుతుండగా.. మరోవైపు.. డెలివరీ చేసేందుకు వైద్య సిబ్బంది ముందుకు రావడంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో ఆ మహిళా బాత్రూంలోకి వెళ్లి ప్రసవించింది. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్లోని షాపూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. మానవత్వానికే మచ్చ తెచ్చే విధంగా ఆస్పత్రి సిబ్బంది ప్రవర్తించారు. ఆస్పత్రిలో గర్బిణీకి డెలివరీ చేయకపోవడంతో చివరికి ఆమె వెళ్లి బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ గర్బిణీకి ఎయిడ్స్ ఉందనే కారణంతోనే ఆస్పత్రి సిబ్బంది.. ప్రసవం చేసేందుకు నిరాకరించారని బాధిత మహిళ తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది.
అయితే ఈ ఘటనపై ఆస్పత్రి డాక్టర్లు, యాజమాన్యం స్పందించింది. వారు చెప్పే విషయం మాత్రం మరోలా ఉంది. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళకు హెచ్ఐవీ ఎయిడ్స్ ఉన్నట్లు మొదట్లో తమకు తెలియదని డాక్టర్లు, వైద్య సిబ్బంది తెలిపారు. పరీక్షలు నిర్వహించాక హెచ్ఐవీ ఉన్నట్లు తేలిందని.. దీంతో ఆమెను వెంటనే మెటర్నిటీ ట్రామా సెంటర్‌లో చేర్పించినట్లు చెప్పారు. అయితే ఆమె ఆ వార్డు వెనక నుంచి బయటికి వెళ్లి బాత్రూంలో ప్రసవించిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ సీత్యా నాయక్ పేర్కొన్నారు. అసలు హెచ్ఐవీ ఉందని ఆ గర్బిణీకి ప్రసవం చేయమని తాము చెప్పలేదని తెలిపారు. ఇంతలోనే ఆ మహిళ ఇలా బాత్రూంలో శిశువుకు జన్మనిచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం బిడ్డను, తల్లిని వేర్వేరుగా ఉంచినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే వైద్యులు అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ప్రోటోకాల్ పాటిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు పేర్కొంది. మహిళకు చికిత్స చేసిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు హెచ్ఐవీ సంక్రమణ నుంచి రక్షణ కోసం టీకాలు కూడా ఇచ్చినట్లు వివరించారు.