ఓ వ్యక్తి తన ఉద్యోగం కోసం 3 దశాబ్దాలుగా పోరాడుతూనే ఉన్నారు. సుదీర్ఘ కాలంగా చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది. చివరికి సుప్రీం కోర్టు మెట్లక్కడంతో అతనికి న్యాయం జరిగింది. ఉద్యోగం కోసం తాను చేస్తున్న ఏళ్ల పోరాటం ఫలించి ఉద్యోగం లభించింది. 50 ఏళ్ల వయసులో ఆ వ్యక్తికి ఉద్యోగం వరించింది. దీంతో 28 ఏళ్ల కిందటి కేసు ముగిసింది. మొదట ఉద్యోగానికి ఎంపిక చేసిన వ్యక్తిని ఆ తర్వాత అనర్హుడు అని ప్రకటించి ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో ఆ వ్యక్తి అప్పటి నుంచీ పోరాటం ప్రారంభించి చివరికి ఇప్పుడు విజయం సాధించారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
ఉత్తర్‌ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ పోస్టల్ డివిజన్‌లో 10 పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే అందులో అంకుర్ గుప్తా అనే వ్యక్తి కూడా దరఖాస్తు చేసుకున్నాడు. తపాలా శాఖలో ఉద్యోగానికి ఎంపికైనా ఉద్యోగంలో చేరేందుకు మాత్రం దాదాపు 3 దశాబ్దాల పాటు పోరాటం చేయాల్సి వచ్చింది. చివరికి సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులతో 50 ఏళ్ల వయసులో ఆయనకు ఆ ఉద్యోగం లభించింది. రిక్రూట్‌మెంట్‌లో అంకుర్ గుప్తాను అనర్హుడిగా ప్రకటించడంలో పోస్టల్ డిపార్ట్‌మెంట్ తప్పు ఉందని గుర్తించిన సుప్రీం కోర్టు.. అతడిని వెంటనే పోస్టల్ అసిస్టెంట్‌గా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.
1995 లో ఈ రిక్రూట్‌మెంట్ నిర్వహించగా.. అంకుర్ గుప్తా సహా మెరిట్ జాబితాలో ఉన్నవారిని లఖింపుర్ ఖేరీ పోస్ట్ ఆఫీసులో 15 రోజుల పాటు ట్రైనింగ్‌కు పంపించారు. అయితే ఉన్నతాధికారులు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేయగా.. ఇంటర్ ఒకేషనల్ చదివిన అంకుర్ గుప్తా సహా మరి కొంతమందిని ఆ ఉద్యోగానికి అనర్హులు అని ప్రకటించి ఉద్యోగంలోకి తీసుకోలేదు. దీంతో అంకుర్ గుప్తా సహా బాధితులు అంతా 1996 లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించి తమ బాధలు చెప్పుకున్నారు. దీంతో విచారణ జరిపి వారిని ఉద్యోగంలోకి తీసుకోవాలని ట్రిబ్యునల్ ఉత్తర్వులిచ్చింది. ట్రిబ్యునల్ ఆదేశాలను 2000 లో హైకోర్టులో తపాలా శాఖ సవాల్ చేసింది. ట్రిబ్యునల్ ఆదేశాలను సమర్థించిన హైకోర్టు.. 2017 లో పోస్టల్ డిపార్ట్‌మెంట్ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఆ ఆదేశాలపై రివ్యూ పిటిషన్‌ను 2021లో వేసినా.. దాన్ని కూడా హైకోర్టు తిరస్కరించింది. దీంతో చివరికి తపాలా శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం.. తపాలా శాఖ పిటిషన్‌ను కొట్టేసింది. ఉద్యోగానికి దరఖాస్తులు తీసుకునే సమయంలో ఒకేషనల్ కోర్సులు చదివినవారు అనర్హులు అని పోస్టల్ శాఖ ఎక్కడా స్పష్టం చేయలేదని కోర్టు గుర్తించింది. అంతే కాకుండా దరఖాస్తులను పరిశీలించే సమయంలోనే ఆ అభ్యర్థులను వెనక్కి పంపించకుండా ఉద్యోగం వచ్చిన తర్వాత ఎలా తొలగిస్తారని ప్రశ్నించింది. అయితే ఈ 28 ఏళ్లు సుదీర్ఘ న్యాయ పోరాటంలో ముందు ఉన్న అభ్యర్థులు వైదొలిగినప్పటికీ.. ఒక్క అంకుర్ గుప్తా మాత్రమే చివరి వరకు పోరాడి విజయం సాధించారు.
దీంతో నెల రోజుల్లోగా పోస్టల్ అసిస్టెంట్‌గా అంకుర్ గుప్తాను నియమించాలని సుప్రీంకోర్టు తపాల శాఖను ఆదేశించింది. అయితే ప్రస్తుతం అంకుర్ గుప్తా వయసు 50 ఏళ్లు కాగా.. మరో 10 అంటే 60 ఏళ్ల వయసులో ఆయన రిటైర్మెంట్ కానున్నారు. ఈ క్రమంలోనే ఇన్నేళ్లుగా జీతం బకాయిలు, సీనియార్టీని క్లెయిమ్ చేసుకోలేరని కోర్టు స్పష్టం చేసింది. పింఛను పొందేందుకు అర్హత లభించే సర్వీసు ఆయనకు ఉండదని.. అయితే రిటైర్మెంట్ ప్రయోజనాలకు ఆయనను అర్హుడిగా పరిగణించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.