ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన చర్చే నడుస్తోంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ.. ప్రాంతీయ పార్టీలకు తోడు జాతీయ పార్టీలు కూడా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ ఎన్నికల సంగ్రామంలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ కొత్త పథకాలు, పాత పథకాలకు మరింత రంగులు అద్దడం చేస్తుండగా.. ప్రతిపక్ష పార్టీలు.. హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఇక ఎన్నికలు అంటే తెరవెనుక బీరు, బిర్యానీ, మందు సీసాలు, డబ్బులు, గిఫ్ట్‌లు సర్వ సాధారణమే. ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని పార్టీలు, అభ్యర్థులు.. ఓటర్లను ప్రలోభపెడుతూనే ఉంటారు. కానీ వాళ్లు మాత్రం ఓటేస్తే చాలు ఉచితంగా పోహా జిలేబీ అందిస్తామని చెబుతున్నారు.
అయితే ఈ ఆఫర్ మన రాష్ట్రంలో అయితే కాదు. మన తెలంగాణతోపాటే జరగనున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇండోర్ ఓటర్లకు స్థానిక దుకాణదారులు బంపరాఫర్ ప్రకటించారు. ఓటు వేసి వచ్చిన వారికి తమ దుకాణాల్లో ఉచితంగా పోహా, జిలేబీ అందిస్తామని తెలిపారు. ఉదయం 9 గంటల లోపు ఓటు వేసి చేతికి సిరా గుర్తు చూపించిన వారికి ఉచితంగా పోహా, జిలేబీ ఇస్తామని ఇండోర్‌లోని ఫుడ్ హబ్ అయిన "56 దుకాణ్" యాజమాన్యం ప్రకటించింది. అయితే 9 గంటల లోపు వచ్చిన వారికి మాత్రమే ఉచితంగా ఇస్తామని స్పష్టం చేసింది. ఆ తర్వాత వచ్చిన వారికి 10 శాతం డిస్కౌంట్‌తో జిలేబీ, పోహా ఇస్తామని పేర్కొంది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకే ఈ ఉచిత ఆఫర్‌ను ప్రకటించామని ‘56 దుకాణ్’ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుంజన్ శర్మ స్పష్టం చేశారు. పరిశుభ్రత విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఇండోర్‌ను.. ఎన్నికల ఓటింగ్ శాతంలోనూ అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. అందుకే తాము ఈ ప్రయత్నం చేస్తున్నామని గుంజన్ శర్మ తెలిపారు. ఇండోర్ అర్బన్ పరిధిలో 5 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2018 లో మొత్తం ఈ 5 అసెంబ్లీ స్థానాల పరిధిలో14.72 లక్షల ఓటర్లు ఉండగా.. అందులో 67 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సారి ఓటర్ల సంఖ్య 15.55 లక్షలకు పెరిగింది. ఇక మధ్యప్రదేశ్‌లోని 230 స్థానాలకు నవంబర్ 17 వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.