హమాస్ ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారమే ఇజ్రాయెల్‌పై దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దృష్టిని మళ్లించి సరైన సమయం చూసి విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని విధంగా చివరికి ఇజ్రాయెల్‌కు కూడా అనుమానం రాకుండా దాడులకు పాల్పడినట్లు సమాచారం. అయితే ఈ విషయాలని హమాస్ ఉగ్ర సంస్థ సీనియర్ అధికారి అలీ బరాకా వెల్లడించారు. ఇజ్రాయెల్‌పై చేసిన దాడులు అప్పటికప్పుడు అనుకుని.. చేసిన మెరుపు దాడులు కావని అలా బరాకా స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించుకునే ప్లాన్ చేసి వాటిని అమలు చేసినట్లు వెల్లడించారు.
ఈ మేరకు ఓ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హమాస్ సీనియర్ అధికారి అలీ బరాకా అంగీకరించారు. గత శనివారం ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదులు చేసిన ఊచకోతకు రెండేళ్ల క్రితమే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. అయితే ఈ ప్లాన్ గురించి కేవలం అతి కొద్దిమంది హమాస్ నేతలకు మాత్రమే తెలుసని వెల్లడించారు. గాజా ప్రజలను పరిపాలిస్తున్నట్లు ప్రపంచాన్ని నమ్మిస్తూ.. భారీ దాడికి ప్లాన్‌కు ప్లాన్ వేసిందని వివరించారు. దీనికి సంబంధించి డైలీ మెయిల్ బుధవారం ఒక కథనాన్ని వెలువరించింది.
హమాస్ సంస్థ గాజాలో ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు ఇజ్రాయెల్‌తోపాటు ప్రపంచ దేశాలన్నింటినీ నమ్మించి.. భారీ యుద్ధానికి తెరతీసినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రులు, నివాస ప్రాంతాలతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలే లక్ష్యంగా దాడులు చేసి ప్రాణ నష్టాన్ని పెంచాలని నిర్ణయించుకున్నట్లు అలీ బరాకా తెలిపారు. గాజాలోని పౌరులు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ నుంచి తీవ్ర హెచ్చరికలు ఉన్నప్పటికీ.. పాలస్తీనా వాసులు అలాగే ఇళ్లలోనే ఉండాలని.. హమాస్ ఉగ్రవాదులు సూచించడం యుద్ధాన్ని మరింత తీవ్ర తరం చేసింది.
ఇక హమాస్ ఉగ్రవాదుల గురించి మాట్లాడిన అలీ బరాకా.. ఈ యుద్ధంలో ప్రాణాలు అర్పించేందుకు కూడా హమాస్ నిర్ణయించుకుందని తెలిపారు. చనిపోయినవారిని అమరులుగా గుర్తిస్తారని చెప్పారు. ఇక హమాస్ ఉగ్రవాదులకు ఇరాన్ ఆర్థికంగా మద్దతుగా నిలిచిందని పేర్కొన్నారు. తమ ప్రాంతాన్ని విస్తరించేందుకు ఇరాన్ సహకారం ఉంటుందని.. అదే సమయంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు.
ఇక ఇరాన్ మద్దతు గల హమాస్ ఉగ్రవాదులు తాజాగా ఇజ్రాయెల్‌పై చేసిన దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. ఇక హమాస్ ఉగ్రవాదుల చేతుల్లో అత్యాచారాలు, సజీవ దహనాలు.. తల మొండెం వేరు చేయడం వంటి భయంకరమైన ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మరోవైపు.. ఇజ్రాయెల్‌పై దాడులకు దిగిన హమాస్ ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశారు. ఏకంగా గాజా నుంచి హమాస్ ఉగ్రవాదులను ఏరిపారిస్తామని ప్రతిజ్ఞ చేశారు.