హమాస్ ఉగ్రవాదులు తమపై చేసిన దాడులకు ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌ను చుట్టుముట్టిన ఇజ్రాయెల్ బలగాలు.. ఆ ప్రాంతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే గాజా స్ట్రిప్‌కు ఆహారం, కరెంట్, తాగు నీటిని నిలిపివేసిన ఇజ్రాయెల్ ఆ ప్రాంతంపై యుద్ధ విమానాలతో దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే హమాస్ ఉగ్రవాద సంస్థ టాప్ కమాండర్‌ను మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. గాజా స్ట్రిప్‌లోని హమాస్ నెట్‌వర్క్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే కీలక కమాండర్ మరణించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని మాత్రం హమాస్ సంస్థ నిర్ధారించలేదు.
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ భద్రతా బలగాలు యుద్ధ విమానాలతో దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే హమాస్ ఉగ్రవాదులు ఏరియల్ ఆపరేషన్లు నిర్వహించే హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల్లో హమాస్ ఏరియల్ ఫోర్స్ హెడ్ అబు మురద్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది. ఈ విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పత్రిక స్పష్టం చేసింది. శుక్రవారం రాత్రి హమాస్ దళాలకు చెందిన వివిధ ప్రాంతాలపై ఇజ్రాయెల్ బలగాలు పదుల సంఖ్యలో వైమానిక దాడులు చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు మెరుపు దాడులకు దిగడం వెనుక అబు మురద్ కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అబు మురద్‌ను మట్టుబెట్టినట్లు వస్తున్న వార్తలపై హమాస్ సంస్థ ఇంకా స్పందించలేదు.
ఇక ఇప్పటికే గాజా స్ట్రిప్‌ను చుట్టు ముట్టిన ఇజ్రాయెల్ బలగాలు.. ఆ ప్రాంతంలో ఉన్న పౌరులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉత్తర గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ మొదలు పెట్టేందుకు ఇజ్రాయెల్ భద్రతా బలగాలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పాలస్తీనా పౌరులు తక్షణమే ఉత్తర గాజాను వదిలి దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని సూచించింది. ఇజ్రాయెల్ హెచ్చరికలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాలస్తీనా వాసులు దక్షిణ గాజా ప్రాంతానికి పరుగులు తీస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ బలగాలు చేస్తున్న నిరంతర దాడులతో వారు వెళ్లలేకపోతున్నారు. అయితే వారి కోసం ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేసి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తరలిస్తోంది. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరలింపు కారిడార్లు ఏర్పాటు చేసింది. మరోవైపు.. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌లోకి ఉగ్ర చొరబాట్లు జరుగుతున్నట్లు ఆ దేశం ఆరోపించింది. లెబనాన్ నుంచి సరిహద్దుల గుండా తమ దేశంలోకి ఉగ్రవాదులు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. సరిహద్దులు దాటేందుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఐడీఎఫ్ తెలిపింది.