నేటినుండి నుంచి తొమ్మిదిరోజుల పాటు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి అలంకార ఉత్సవాలను వైదికంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం బంగారు తిరుచ్చిపై, రాత్రి పెద్ద శేషవాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుడు శనివారం రాత్రి ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. అనంతరం పడమరగా ఉన్న వసంత మండపానికి వేంచేశారు. అక్కడ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పుట్టమన్నును సేకరించి నవపాలికలలో ఉంచుకుని మిగిలిన మాడవీధుల్లో ప్రదక్షిణగా ఆలయానికి వేంచేశారు. యాగశాలలో శాస్త్రోక్త కార్యక్రమాలను నిర్వహించి పాలికలలోని పుట్టమన్నులో నవధాన్యాలను మొలకెత్తింపచేసే ప్రక్రియను వైదికంగా నిర్వహించారు. దీంతో స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు నాంది పలికినట్లయింది.