శ్రీకాకుళం నగరంలోని బలగ భద్రమ్మ గుడి సమీపంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే... .. బలగ కుమ్మరి వీధికి చెందిన వంజరాపు కిషోర్ (16) అదే ప్రాంతంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. శనివారం నుంచి పాఠశాలకు దసరా సెలవులు ఇవ్వడంతో తన స్నేహితుడు చరణ్‌తో కలిసి నాగావళి నదిలో స్నానానికి వెళ్లాడు. చరణ్‌కి ఈతరాకపోవడంతో ఒడ్డునే ఉండిపోయాడు. కొద్దిపాటి ఈత వచ్చిన కిషోర్ నదిలోకి దిగి స్నానం చేస్తుండగా నీటి ప్రవాహంలో చిక్కుకుని మునిగిపోతుండగా అక్కడే చేపలు పడుతున్న బమ్మిడి సురేష్, పొట్నూరు జగదీష్ గమనించి కాపాడే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న ఏడీ ఎఫ్‌ఓ వరప్రసాద్ తన బృందం గంటపాటు ఇంజన్ బోటుపై నదిలో గాలించగా కిషోర్ మృతదేహం లభ్యమైంది. తండ్రి ఫిర్యాదు మేరకు రెండో పట్టణ సీఐ పి.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.