ప్రతిమూడేళ్లకు ఒకసారి వచ్చే అధికమాసంలో తిరుమల శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. కన్యామాసంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, ఆశ్వయుజ మాసంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వైఖానస ఆగమోక్తంగా ఈ అంకురార్పణ కార్యక్రమం జరిగింది. అనంతరం సేనాధిపతిని వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణగా పిలుస్తారు. వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం అంకురార్పణ ఘట్టాన్ని ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితుల పర్యవేక్షణలో కంకణభట్టాచార్యులు కె.ఎస్.వాసుదేవభట్టాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు వైభవంగా నిర్వహించారు. విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.
వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యత ఉంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడిని ‘సస్యకారక’ అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో పలు పవిత్ర విత్తనాలు నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి. విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి మహర్షి తన ‘సముర్తార్చన అధికరణ’ అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని వివరించారు.
అంకురార్పణానికి ముందు.. ఆ రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత అగ్నిహోత్రం ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు. ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపి... చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది.
అంకురార్పణ ఘట్టం పూర్తికావడంతో బ్రహోత్సవాలు ఆదివారం నుంచి అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. ఈ నెల 23న జరిగే చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. మొదటి రోజు అక్టోబర్ 15న ఉదయం బంగారు తిర్చుచ్చి.. రాత్రి పెద్దశేషవాహన సేవ, అక్టోబర్ 16న ఉదయం చిన్నశేషవాహన సేవ, రాత్రి హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమిస్తారు. అక్టోబర్ 17న ఉదయం సింహ వాహన సేవ, రాత్రి ముత్యపుపందిరి వాహన సేవ, అక్టోబర్ 18న ఉదయం కల్పవృక్ష వాహన సేవ,రాత్రికి సర్వభూపాల వాహన సేవ ఉంటాయి. అక్టోబర్ 19న ఉదయం మోహినీ అవతారం, అదే రోజు రాత్రి గరుడ వాహన సేవ.. అక్టోబర్ 20న ఉదయం హనుమంత వాహన సేవ, రాత్రికి పుష్పకవిమాన సేవ ఉంటాయి. పుష్పక విమానం సేవను అధిక మాసం సందర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వహిస్తారు. వాహనసేవల్లో అలసిపోయే స్వామి, అమ్మవార్లు సేద తీరడానికి పుష్పక విమానంలో వేంచేపు చేస్తారు. అనంతరం అదే రోజు రాత్రి గజవాహన సేవ ఉంటాయి. అక్టోబర్ 21న ఉదయం సూర్యప్రభ వాహన సేవ, రాత్రికి చంద్రప్రభ వాహన సేవ.. అక్టోబర్ 22న ఉదయం స్వర్ణరథం, రాత్రికి అశ్వవాహన సేవలు ఉంటాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa