రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎ్‌సకు ఆప్షన్ ఇవ్వొద్దని, ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ స్కీమ్‌నే ఎంచుకోవాలని ఆర్టీసీ ఉద్యోగులకు ఈయూ పిలుపునిచ్చింది. ముందు ఈపీఎఫ్ పెన్షన్ స్కీమ్‌ను ఎంచుకున్న తర్వాత ఓపీఎస్ కోసం కోర్టుల్లో కేసులు వేస్తామని సంఘాల నేతలు చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రజా రవాణా సంస్థలో విలీనం చేసి దాదాపు మూడేళ్లు కావస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 50వేల మంది పీటీడీ ఉద్యోగులు ఉండగా, వీరు ఏ పెన్షన్ పరిధిలోకి వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఓపీఎస్ సాధన దిశగా న్యాయపోరాటం చేసేందుకు ఎన్‌ఎంయూ, ఈయూ అడుగులు వేస్తున్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల్లో 2004 కంటే ముందునుంచి పనిచేస్తున్న వారు సుమారు 23వేల మంది ఉన్నారు. పాత పెన్షన్ నిబంధనల ప్రకారం వీరికి ఓపీఎస్ కచ్చితంగా అమలు చేయాలి అని కోరుతున్నారు.