హమాస్ ముష్కరుల దాడి నుంచి తమ పౌరులను కాపాడిన ఇజ్రాయేల్‌లో కేర్‌టేకర్లుగా పనిచేస్తున్న ఇద్దరు భారతీయ మహిళలపై ఇజ్రాయేల్ ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. మిలిటెంట్లను అడ్డుకోడానికి ఇద్దరు కేరళ మహిళల చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తూ భారత్‌లోని ఇజ్రాయేల్ రాయబార కార్యాలయం ట్విట్ చేసింది. తన అధికారిక ట్విట్టర్‌లో వీడియోను షేర్ చేసిన ఎంబసీ.. ‘ఇండియన్ సూపర్ వుమెన్’ అంటూ సంబోధించింది. ఆ వీడియోలోని మహిళ.. డోర్ హ్యాండిల్‌ను పట్టుకుని హమాస్ ముష్కరులు తమ వద్దకు రాకుండా నిరోధించినట్టు ఆనాటి భయానక స్థితిని వివరించారు.
గాజా సరిహద్దుల్లోని నీర్ ఓర్ అనే కిబ్బుట్జ్‌లో మీరా మోహనన్‌తో కలిసి కేర్ టేకర్‌గా పనిచేస్తున్నట్టు సబిత తెలిపారు. నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాహెల్ అనే వృద్ధురాలికి సంరక్షకులుగా ఉన్నట్టు చెప్పారు. ‘నేను మూడేళ్లుగా కిబ్బుట్జ్ సరిహద్దుల్లోని ఓ ఇంట్లో సంరక్షకులుగా పని చేస్తున్నాం.. ఏఎల్ఎస్ వ్యాధితో బాధపడుతున్న ఒక వృద్ధురాలిని చూసుకుంటాం.. హమాస్ దాడి జరిగిన రోజు నాది నైట్ డ్యూటీ.. ఉదయం 6:30 గంటలకు బయలుదేరబోతున్నాను.. సైరన్‌లు విని సేఫ్టీ రూమ్‌వైపు పరుగెత్తాం.. ఇది నాన్‌స్టాప్‌గా మోగుతోంది’ అని ఆమె చెప్పారు.
రాహెల్ కుమార్తె తనకు ఫోన్ చేసి.. పరిస్థితి మన చేతుల్లో లేదని చెప్పింది.‘మాకు ఏమి చేయాలో తోచలేదు. ముందు, వెనుక తలుపులు లాక్ చేయమని ఆమె కోరింది.. ఫ్లోర్‌పై పట్టు సాధించడానికి చెప్పులు వదిలిపెట్టాం.. కొద్ది నిమిషాల్లో ఉగ్రవాదులు మా ఇంట్లోకి చొరబడి కాల్పులు జరపడం, అద్దాలు పగలగొట్టిన శబ్దాలు విన్నాం..రాహేల్ కుమార్తె మమ్మల్ని తలుపును బలంగా పట్టుకోమని.. వదిలేయొద్దని చెప్పింది.. ఆ తలుపు పట్టుకుని నాలుగైదు గంటలు అక్కడే ఉన్నాం. దాదాపు 7:30 నుంచి ఉగ్రవాదులు ఇంట్లోనే ఉన్నారు. వారు తలుపు బద్దలుగొట్టేందుకు ప్రయత్నించారు.. కానీ, మేము మా వంతు ప్రయత్నం చేశాం.. వాళ్లు డోర్ కొట్టి కాల్పులు జరిపారు’’ అని సబిత చెప్పారు.
ముష్కరులు ప్రతీదీ నాశనం చేసిందని, బయటకు ఏం జరుగుతుందో మాకు తెలియదని ఆమె పేర్కొంది. కొన్ని గంటల తర్వాత మధ్యాహ్నం 1 గంటకు మళ్లీ కాల్పులు శబ్దం వినిపించింది. ‘ఇజ్రాయేల్ సైన్యం మమ్మల్ని రక్షించడానికి వచ్చిందని ఇంటి యజమాని ష్ములిక్ మాకు చెప్పారు.. మావద్ద ఏమీ లేవు.. మమ్మల్ని పూర్తిగా దోచుకున్నారు. పాస్‌పోర్ట్, .నా ఎమర్జెన్సీ బ్యాగ్ ఎత్తుకెళ్లారు.. ఉగ్రదాడి జరుగుతుందని మేము ఊహించలేదు.. కానీ క్షిపణులు దూసుకొస్తాయని తెలుసు.. ఆ సమయంలో ము సేఫ్టీ రూమ్‌లలోకి వెళ్లి తలదాచుకునే వాళ్లం.. కానీ ఆ రోజున ఏమీ చేయడానికి మాకు సమయం లేదు’ ఆమె చెప్పింది.
బుల్లెట్ గుర్తులతో ఉన్న తలుపు, గోడల ఫోటోలను కూడా ఇజ్రాయేల్ ఎంబసీ షేర్ చేసింది. ‘ఇండియన్ సూపర్ వుమెన్! కేరళకు చెందిన సబిత అనే కేర్‌టేకర్ కథను వినండి.. ఆమె, మీరా మోహనన్ డోర్ హ్యాండిల్ పట్టుకుని, హమాస్ ఉగ్రవాదులు లోపలి చొరబడకుండా అడ్డుకుని, ఇజ్రాయేల్ పౌరులను ఎలా రక్షించారో చూడండి’ అని రాసుకొచ్చింది. కాగా, గాజాలోని ఒక ఆసుపత్రిలో మంగళవారం జరిగిన పేలుడులో కనీసం 500 మంది మరణించారనే వార్త యావత్తు ప్రపంచాన్ని ఆవేదనకు గురిచేస్తోంది. ఇజ్రాయేల్ వైమానిక దాడుల వల్లే ఈ పేలుడు జరిగినట్టు హమాస్ ఆరోపించగా.. హమాస్ రాకెట్లు మిస్ ఫైరింగ్ అని ఇజ్రాయేల్ సైన్యం ఆరోపించింది.