విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు అమ్మవారు శ్రీమహాచండీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఏడాది నుంచే కొత్తగా ఇంద్రకీలాద్రిపై మహాచండీదేవి రూపంలో అమ్మవారిని అలంకరించారు. ఎప్పుడూ లేని విధంగా తొలిసారి దసరా ఉత్సవాలలో దుర్గాదేవి శ్రీ మహా చండీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 70 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా మహాచండీదేవిగా భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇస్తున్నారు. చండీదేవి అలంకారానికి ఎంతో ప్రసిధ్ది ఉందంటున్నారు వేదపండితులు. అమ్మవారు మహచండీ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారని.. దేవతల కార్యసిధ్ది, దుష్టశిక్షణ, విష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి , మహాకాళీ, మహా సరస్వతి, త్రిశక్తి రూపిణీగా శ్రీ మహాచండీ ఉద్బవించింది అంటున్నారు.చండీ అమ్మవారిలో అనేకమంది దేవతలు కొలువై ఉన్నారని.. శ్రీ మహా చండీ అమ్మవారిని ప్రార్ధిస్తే సర్వదేవతలను ప్రార్ధించినట్లే అంటున్నారు పండితులు. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి సంపదలు లభించి శత్రువులు మిత్రువులు మారడం... ఏ కోర్కెల కోసం అయితే ప్రార్ధిస్తామో అవి సత్వరమే నెరవేరతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. తెల్లవారుజామున 3 గంటల నుంచే అమ్మవారి దర్శన భాగ్యం భక్తులకు కల్పించారు.