ఎక్కడ సమావేశాలు పెట్టిన సీఎం జగన్ అబద్దాలే తప్ప.. వాస్తవాలు మాట్లాడిన సందర్భాలు లేవని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వాపోయారు. నాసిరకం మద్యం వల్ల 30 వేల మంది చనిపోయారని, నాసిరకం మద్యంతో 35 లక్షల మంది రోగాల బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక రద్దుతో కార్మికులు ఉపాధి కోల్పోయారని, రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం రూ.64 వేల కోట్లు పడిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలన్నీ నెరవేర్చానని సీఎం జగన్ చెబుతున్నారని, అధికారంలో రాగానే సీపీఎస్ రద్దు చేస్తామన్నారు.. చేశారా?.. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు.. ఇస్తున్నారా?.. 25 మంది ఎంపీలనిస్తే ప్రత్యేక హోదా తెస్తానన్నారు.. తెచ్చారా?.. పోలవరం పూర్తిచేస్తానన్నారు.. చేశారా?.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? అని అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.