ఇండియా కూటమికి క్రమంగా బీటలు వారుతున్నాయి. నరేంద్ర మోదీని ప్రధాని పదవి నుంచి దించాలన్న ఆశయంతో జట్టు కట్టిన పార్టీలు.. ఆచరణలో మాత్రం ఆ టీమ్ వర్క్ కనిపించడం లేదు. కొన్ని అంశాలపై కూటమిలోని పార్టీల మధ్య అభిప్రాయ బేధాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో జాతీయ స్థాయిలో కూటమిలోని అన్ని పార్టీలు కలిసే ఉన్నప్పటికీ రాష్ట్రాల్లో మాత్రం నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ ఎన్నికల వేళ ఇండియా కూటమికి మరో తలనొప్పి వచ్చి పడింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న సమాజ్‌వాదీ పార్టీకి కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరడం లేదు. ఈ నేపథ్యంలోనే కూటమి నుంచి అఖిలేష్ యాదవ్ తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాము బలంగా ఉన్నామని భావిస్తున్న స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. అయితే అక్కడ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కొన్ని సీట్లు ఇవ్వాలని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కోరగా.. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. దీంతో 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అఖిలేష్ యాదవ్ తన పార్టీ తరఫున అభ్యర్థులను బరిలో దింపనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్, సమాజ్‌వాదీ మధ్య కుమ్ములాట మొదలైంది.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల పొత్తు బెడిసికొట్టడంతో కాంగ్రెస్ పార్టీపై అఖిలేష్ యాదవ్ మాటల తూటాలు పేల్చారు. కాంగ్రెస్ పార్టీ చేసింది ద్రోహమని.. బహిరంగంగా విమర్శలు గుప్పించిన అఖిలేష్ యాదవ్.. ఇలాంటి గందరగోళం కొనసాగితే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏను ఇండియా కూటమి ఎప్పటికీ ఓడించలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమకు మధ్యప్రదేశ్‌లో సీట్లు ఇవ్వకూడదని కాంగ్రెస్ భావిస్తే ముందే చెప్పాల్సి ఉండేదని పేర్కొన్నారు. తమకు 6 సీట్లు ఇవ్వడం గురించి ఆలోచిస్తామని కాంగ్రెస్ చెప్పినా.. అభ్యర్థులను ప్రకటించినప్పుడు తమ పార్టీ ప్రస్తావన తీసుకురాలేదని మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో కూటమి లేదని ముందే తెలిస్తే.. అసలు ఇండియా కూటమితో కలిసేవాడినే కాదు కదా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇలాగే వ్యవహరిస్తే వారితో ఎవరు నిలబడతారని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఎస్పీ, కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తడంతో ఇండియా కూటమి భవిష్యత్తు అయోమయంలో పడినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. విషయంలో భయపడుతున్న ఇండియా కూటమికి ఎస్పీ కొత్త తలనొప్పిగా మారింది.