మన దేశంలో రైతులు పడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. విత్తనం పెట్టినప్పటి నుంచి పంట కోసి అమ్ముకునే వరకు ఎక్కడ చిన్న తప్పు జరిగినా కొన్ని నెలల కష్టం నేలపాలు అవుతుంది. కొన్నిసార్లు ప్రకృతి ప్రకోపం చూపిస్తుండగా.. మరికొన్నిసార్లు ప్రభుత్వాలు, అధికారులు చేసే చర్యల వల్ల అన్నదాతలు నష్టాల పాలవుతున్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, కరెంట్ సరైన సమయంలో అందకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తాజాగా పగటి పూట కరెంట్ ఇవ్వకుండా రాత్రి వేళల్లో ఇవ్వడంతో విసుగు చెందిన రైతులు.. ఏకంగా కరెంట్ ఆఫీస్‌కు మొసలిని తీసుకువచ్చారు.
ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. విద్యుత్ అధికారులు తమకు పగటి పూట కాకుండా రాత్రి వేళ కరెంట్ ఇస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. విజయపూర్ జిల్లా కొల్హారా తాలుకాలోని రోనిహాల్ గ్రామ ప్రజలు గత కొన్ని రోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వారు చేస్తున్న విజ్ఞప్తులను అధికారులు పెడచెవిన పెట్టడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలోనే హెస్కామ్ - హుబ్లీ ఎలక్ట్రిసీటీ సప్లయ్ కంపెనీ లిమిటెడ్) ఆఫీస్‌కు ఏకంగా మొసలిని తీసుకువచ్చారు. తాళ్లతో కట్టేసిన మొసలిని ట్రాక్టర్‌లో తీసుకువచ్చి హెస్కామ్ ఆఫీస్ ముందు వదిలారు. అది చూసిన హెస్కామ్ అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
కొన్ని రోజులుగా తాము శాంతియుతంగా తమ ఆవేదనను చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని.. అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని రైతులు చెబుతున్నారు. రాత్రి పూట చాలా ఆలస్యంగా పొలాలకు త్రీఫేజ్ కరెంట్ ఇస్తున్నారని తెలిపారు. చీకట్లో పొలాలకు వెళ్లడం చాలా భయంకరంగా ఉందని అన్నదాతలు వాపోయారు. చీకట్లో పాములు, తేళ్లు, మొసళ్లు, అడవి జంతువుల నుంచి ప్రాణ భయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పడే ఇబ్బందులు అధికారులకు కూడా తెలియాలనే ఇలా చేసినట్లు స్థానిక రైతులు పేర్కొన్నారు.
రాత్రి పూట కరెంట్ ఇవ్వడం వల్ల ఏం లాభమని రైతులు ప్రశ్నించారు. వెళ్తే ప్రాణ భయం, వెళ్లకపోతే పొలాలకు నీరు పెట్టలేమని తీవ్ర మనోవేదన వెల్లగక్కారు. తమ సమస్యను అధికారులు అర్థం అయ్యేలా చెప్పేందుకు కరెంట్ ఆఫీస్‌కు మొసలిని తీసుకొచ్చామని స్పష్టం చేశారు. పగటిపూట త్రీఫేజ్ కరెంటు ఇవ్వకపోవడం వల్ల ఎన్నో అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన అటవీ అధికారులు.. రైతులకు సర్ది చెప్పి వారు తీసుకువచ్చిన మొసలిని తీసుకెళ్లారు. దీంతో ఈ గొడవ అక్కడికి సద్దుమణిగింది.