దసరా సెలవుల నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో విషాదం నెలకొంది. విహారయాత్రకు వెళ్లి యువకులు గోదావరిలో గల్లంతైన సంఘటన కలిచివేసింది. వివరాల్లోకి వెళ్ళితే....తణుకు పట్టణం సజ్జాపురం పార్కువీధికి చెందిన హనుమకొండ కార్తీక్, మద్దిని ఫణీంద్రగణేష్, పెండ్యాల బాలాజీ, తిరుమలరావు రవితేజ, నేదునూరి భానుప్రసాద్, సలాది దుర్గామహేష్, కొమ్మిరెడ్డి చైతన్య స్నేహితులు. ఈ ఏడుగురు యువకులు దసరా సెలవులు కావడంతో సరదాగా మూడు మోటారుసైకిళ్లపై యానాం వచ్చారు. శనివారం ఉదయం 10గంటలకు యానాం చేరుకుని అక్కడ కాసేపు గడిపారు. అక్కడినుంచి తాళ్లరేవు మండలంలోని గోపిలంక పుష్కరఘాట్‌కి ఒంటి గంట సమయానికి చేరుకున్నారు. గోదావరి ఒడ్డున స్నేహితులంతా కలిసి సరదాగా పార్టీ చేసుకుంటున్నారు. ఇంతలో వీరిలో ఒకరు పరుగెత్తుకుని వెళ్లి అకస్మాత్తుగా గోదావరిలోకి స్నానం చేయడం కోసం దూకాడు. అతడు లోతు తెలియకపోవడంతో మునిగిపోతూ హాహాకారాలు చేశాడు. ఇది గమనించిన ముగ్గురు స్నేహితులు అతడిని కాపాడేందుకు గోదావరిలోకి దూకి వారు కూడా గల్లంతయ్యారు. అలా హనుమకొండ కార్తీక్(21), మద్దిని ఫణీంద్రగణేష్(21), పెండ్యాల బాలాజీ(21), తిరుమలరావు రవితేజ(21) గోదావరిలో మునిగిపోయారు. ఈ సంఘటన చూసి భయపడి నేదునూరి భానుప్రసాద్ అనే యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. మరో ఇద్దరు స్నేహితులు సలాది దుర్గామహేష్, కొమ్మిరెడ్డి చైతన్య తమ స్నేహితులను రక్షించే ప్రయత్నం చేసినా గల్లంతైన యువకులను కాపాడలేకపోయారు. అనంతరం వారు తమ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తమ నలుగురు స్నేహితులు గోదావరిలో మునిగిపోయారని సమాచారం ఇచ్చారు. అందిన సమాచారం మేరకు అధికారులు అప్రమత్తమై గోపిలంక పుష్కరఘాట్ వద్దకు చేరుకున్నారు. గల్లంతైన యువకుల కోసం గజ ఈతగాళ్లతో బోటులో గాలింపు చర్యలు చేపట్టారు.