ఇజ్రాయెల్, హమాస్ మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతున్న వేళ ఐక్యరాజ్యసమితిలో జనరల్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. మానవతా దృక్పథంతో వెంటనే ఇరు వర్గాలు యుద్ధాన్ని విరమించాలని సంధికి పిలుపునిస్తూ ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్న గాజా వాసులకు మానవతా సాయం అందించాలని ఆ తీర్మానంలో పొందుపరిచారు. ఈ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించగా.. 120 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా.. 14 దేశాలు వ్యతిరేకించాయి. ఇక మరో 45 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనకుండా దూరంగా ఉన్నాయి. అయితే ఈ తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు మాత్రం భారత్ దూరంగా ఉంది. ఆ తీర్మానంలో హమాస్ దాడి గురించి ప్రస్తావన లేకపోవడమే భారత్ ఓటింగ్‌లో పాల్గొనకపోవడానికి కారణమని తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి అత్యవసర ప్రత్యేక సెషన్‌లో మొత్తం 40 దేశాల మద్దతుతో జోర్డాన్ ఈ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. పౌరుల రక్షణ, చట్టపరమైన, మానవతా బాధ్యతలను సమర్థించడం పేరిట తీసుకువచ్చిన ఈ తీర్మానం మెజారిటీ దేశాలు ఓటింగ్ చేయడంతో ఆమోదం పొందింది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, బ్రిటన్ సహా 45 దేశాలు ఈ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
జోర్డాన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంలో హమాస్ ఉగ్రవాద సంస్థ గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడులను పట్టించుకోలేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటింగ్‌కు ముందు అమెరికా మద్దతుతో కెనడా ఈ తీర్మానానికి ఒక సవరణ ప్రతిపాదించింది. అక్టోబర్ 7 వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిని ఆ తర్వాత పౌరులను బందీలుగా తీసుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండించాలని.. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఎలాంటి షరతులు లేకుండా బందీలను తక్షణమే విడుదల చేయాలని సవరణలో పేర్కొంది. ఆ సవరణను తీర్మానంలో చేర్చాలని కోరింది. ఈ సవరణ ప్రతిపాదనకు భారత్ సహా 87 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా.. 55 దేశాలు వ్యతిరేకించాయి. మరో 23 దేశాలు దూరంగా ఉన్నాయి. అయితే ఆ సవరణకు మెజార్టీ రాకపోవడంతో దాన్ని తీర్మానంలోకి తీసుకోలేదని ఐక్యరాజ్యసమితి 78 వ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డాన్నిస్ ఫ్రాన్సిస్ వెల్లడించారు.
ఇజ్రాయెల్‌పై జరిగిన ఉగ్రదాడి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని.. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా భారత్ పేర్కొంది. బందీల పరిస్థితి గురించే ఆలోచిస్తున్నామని షరతుల్లేకుండా వారిని వెంటనే విడుదల చేయాలని తెలిపింది. ఉగ్రవాదానికి ఎలాంటి హద్దులు లేవని ఇలాంటి ఉగ్రవాద చర్యలకు ఎలాంటి సమర్థన ఉండకూడదని స్పష్టం చేసింది. ప్రపంచ దేశాలన్నీ విభేదాలు పక్కనపెట్టి ఉగ్రవాదాన్ని సహించకూడదని.. దాంతోపాటు మానవతా సంక్షోభాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని భారత్ తెలిపింది. ఇరు వర్గాల మధ్య శాంతి చర్చలు జరిగేలా కృషి చేయాలని కోరుతున్నట్లు ఐరాసలో భారత్ స్పష్టం చేసింది.