అర్ధరాత్రి రోడ్లపై తనిఖీలు చేస్తుండగా.. ఓ కారు డ్రైవర్ చేసిన పనికి ఓ పోలీసు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. నడిరోడ్డుపై బారికేడ్లు పెట్టి వాహనాల్లో సోదాలు నిర్వహిస్తుండగా.. వెనక నుంచి అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఓ కారు తనిఖీలు చేస్తున్న కారుతోపాటు ఒక పోలీస్‌ను కూడా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముందు ఉన్న కారు పక్కకు జరగ్గా.. ఆ పోలీస్ గాల్లోకి ఎగిరి పడ్డాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు.
ల్లీలోని కన్నాట్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ పోలీస్‌ను వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అక్టోబర్ 25 వ తేదీ రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆ పోలీస్ పరిస్థితి నిలకడగానే ఉందని.. ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ చేసినట్లు డాక్టర్లు వెల్లడించారు.
పోలీసును ఢీకొట్టిన తర్వాత ఆ కారు మరింత స్పీడుగా అక్కడి నుంచి పారిపోయింది. దీంతో మరో పోలీస్ వెనుక నుంచి ఛేజ్ చేసి ఆ కారును పట్టుకున్నాడు. ఆ కారు డ్రైవర్‌పై కేసు నమోదుచేసి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అర్ధరాత్రి విధుల్లో ఉన్న పోలీస్‌ను ఢీకొట్టడమే కాకుండా అక్కడి నుంచి పారిపోవడం ఏంటని విమర్శలు గుప్పిస్తున్నారు.