విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు సెంట్రల్ జైలు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. విజయదశమి సందర్భంగా సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీలు రావణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. దాన్ని దహనం చేయడం తీవ్ర విమర్శలు దారి తీసింది. దీంతో రంగంలోకి దిగిన జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ జరిపారు. అనంతరం ఈ ఘటనకు కారణమైన నలుగురు అధికారులపై వేటు వేశారు. ఈ ఘటన గోవాలో జరిగింది.
గోవాలోని కోల్‌వాలే సెంట్రల్ జైలులో రావణుడి బొమ్మను దహనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర కలకలం రేపింది. దాదాపు 10 అడుగుల ఎత్తైన రావణుడి విగ్రహాన్ని ఖైదీలు దహనం చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ ఘటనపై జైళ్ల శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహించిన నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నలుగురు అధికారుల్లో జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ చంద్రకాంత్ హరిజన్, జైలర్లు మహేష్ ఫడ్తే, అనిల్ గాంకర్, అసిస్టెంట్ జైలర్ రామ్‌నాథ్ గౌడ్‌లు ఉన్నారు. వీరిని సస్పెండ్ చేస్తూ జైలు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఓంవీర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఖైదీలు రావణుడి బొమ్మను ఎలా దహనం చేశారనే దానిపై జైలు అధికారులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని అధికారులకు జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతోపాటు జైలు ఆవరణలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు ఎలా అనుమతి ఇచ్చారనే దానిపైనా విచారణ జరపనున్నారు. ఈ ఘటనతో జైలు భద్రతపై తీవ్ర అనుమానాలను లేవనెత్తుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఘటనకు జైలు అధికారులను ప్రాథమికంగా బాధ్యులుగా పరిగణించి సస్పెండ్ చేశారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఇక ఆ రావణుడి బొమ్మ లోపల పెట్టేందుకు ఖైదీల వద్ద క్రాకర్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే జైలు లోపలికి ఎలాంటి పేలుడు పదార్థాలు తీసుకెళ్లడం నిషేధమని.. అలాంటి సమయంలో క్రాకర్లు ఎలా తీసుకెళ్లారన్న దానిపైనా విచారణ జరగనున్నట్లు చెప్పారు. అయితే జైలులో రావణుడి దహనానికి ఎలాంటి అనుమతి లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి నిషేధిత కార్యకలాపాలను జైలులో అనుమతించబోమని జైలు సిబ్బందికి, ఖైదీలకు చెప్పేందుకే ఈ సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిపారు. అయితే ఇటీవల జైళ్ల సంస్కరణలో భాగంగా జైలులో గణేష్ చతుర్థి జరుపుకోవడానికి అధికారులు ఖైదీలకు అనుమతి మంజూరు చేశారు.