చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి వచ్చి.. చంద్రుడి మీద భూమి నీడ పడినప్పుడు ఏర్పడేదే చంద్ర గ్రహణం. ఈ చంద్ర గ్రహణం పౌర్ణమి నాడు ఏర్పడుతుంది. కాగా.. ఈ సంవత్సరంలో చివరి గ్రహణం ఇవాళ (శనివారం ) ఏర్పాటు కానుంది. సూర్య గ్రహణం ఏర్పడిన రెండు వారాల్లోనే తాజాగా చంద్ర గ్రహణం ఏర్పాటు కానుంది. భారత్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ చంద్ర గ్రహణం కనిపిస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసాకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీంతో ఈ చంద్ర గ్రహణం అక్టోబరు 28, 29 రెండు తేదీల్లో ఏర్పడనున్నట్లు పేర్కొన్నారు.
ఇక భారత్, ఆఫ్రికా, ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలోని తూర్పు, ఉత్తర ప్రాంతాలతో పాటు, అట్లాంటిక్ మహా సముద్రం, హిందూ మహా సముద్రం, పశ్చిమ, దక్షిణ పసిఫిక్ మహా సముద్రం ప్రాంతాల్లో ఈ చంద్ర గ్రహణం కనిపిస్తుందని వెల్లడించారు. ఇక మన భారత్‌లోని అన్ని నగరాల్లో ఈ చంద్ర గ్రహణం కనిపించే సమయం దాదాపుగా ఒకటే ఉంది. ఒకే సమయానికి ప్రారంభమే ఒకే సమయానికి పూర్తి కానుంది. మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వైజాగ్‌లలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.06 గంటలకు ఈ చంద్ర గ్రహణం ప్రారంభమై.. 2.22 గంటలకు ముగియనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసా వెల్లడించింది. ఇక ఈ నగరాలే కాకుండా దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, ఇండోర్, లక్నో, పాట్నా, దిస్‌పూర్ వంటి నగరాల్లో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత 1.06 గంటలకు మొదలై.. 2.22 గంటలకు పూర్తి అవుతుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.
అయితే ప్రస్తుతం ఏర్పడనున్న చంద్ర గ్రహణం పాక్షిక గ్రహణం కాబట్టి.. సంపూర్ణ గ్రహణం సమయంలో చంద్రునిలో 12 శాతం ప్రాంతం మాత్రమే భూమి నీడతో కప్పబడి ఉంటుందని తెలిపారు. ఈ చంద్ర గ్రహణం అమెరికాలో కనిపించదని.. అయితే చంద్రోదయం సమయంలో మాత్రం దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ సహా కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుందని నాసా స్పష్టం చేసింది.
ఇటీవలె సూర్య గ్రహణం ఏర్పడింది. ఈ సూర్య గ్రహణం ఏర్పడిన రెండు వారాల వ్యవధిలోనే చంద్రగ్రహణం ఏర్పడతుండటం విశేషం. 2023 లో ఇప్పటికే 3 గ్రహణాలు ఏర్పడగా.. తాజాగా ఏర్పడేది నాలుగోది. ఇక ఇప్పటివరకు రెండు సూర్యగ్రహణాలు, ఒక చంద్ర గ్రహణం ఏర్పడింది. ఈ ఏడాదిలోనే మొదటగా ఏప్రిల్ 20 వ తేదీన సూర్య గ్రహణం.. దాని తర్వాత రెండు వారాలకు మే 5 వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడ్డాయి. ఇప్పుడు కూడా ఆ విధంగానే ఏర్పడుతున్నాయి.