వీధుల్లో తిరుగుతూ ఏది దొరికితే అది తినే ఓ వీధి కుక్కకు విమానయోగం పట్టింది. భారత్ నుంచి ఆ కుక్క విమానంలో నెదర్లాండ్స్‌కు వెళ్లనుంది. దాని కోసం వీసా, పాస్‌పోర్టు కూడా అప్లై చేయగా.. 6 నెలల తర్వాత వచ్చాయి. ఇక త్వరలోనే ఆ కుక్క గాల్లో తేలుతూ నెదర్లాండ్స్ వెళ్లిపోనుంది. అయితే ఆ కుక్క భారత్ నుంచి నెదర్లాండ్స్‌కు వెళ్లడం వెను చాలా పెద్ద స్టోరీనే ఉంది. ఎందుకంటే ఆ కుక్కను నెదర్లాండ్స్ తీసుకెళ్లేందుకు ఆ దేశ మహిళ 6 నెలలుగా భారత్‌లోనే ఉంటోంది. దానికి పాస్‌పోర్టు, వీసా వచ్చేవరకు వేచి చూసింది. చివరికి ఆ కుక్కకు అన్ని అనుమతులు రావడంతో మరికొన్ని రోజుల్లోనే నెదర్లాండ్స్ తీసుకువెళ్లనుంది.
నెదర్లాండ్స్కు చెందిన మెరల్ బొటెన్ బల్ అనే మహిళ కొన్ని నెలల క్రితం భారత్‌కు వచ్చింది. అయితే ఈ పర్యటనలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి వెళ్లింది. అయితే అక్కడ వీధుల్లో తిరుగుతున్న ఒక కుక్కను చూసింది. ఆ కుక్కపై ఇతర శునకాలు దాడి చేయగా.. వాటిని తరిమికొట్టి ఆ కుక్కను మెరల్ కాపాడింది. దీంతో మెరల్ ఎటు వెళ్తే ఆ కుక్క అటే వెళ్లేది. ఈ క్రమంలోనే ఆ కుక్క అంటే మెరల్‌కు నచ్చింది. దీంతో దాన్ని దత్తత తీసుకుని జయ అని పేరు కూడా పెట్టింది. అయితే ఆ కుక్కను తనతోపాటు నెదర్లాండ్స్‌కు తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే జయ కుక్కకు వీసా, పాస్‌పోర్టు అప్లై చేసింది.
ఆ కుక్కకు పాస్‌పోర్ట్, వీసా ప్రక్రియ కోసం 6 నెలలుగా మెరల్ భారత్‌లోనే ఉంటోంది. చివరికి జయ కుక్కకు అన్ని రకాల అర్హత పత్రాలు రావడంతో ఇక నెదర్లాండ్స్ వెళ్లేందుకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. దీనికి సంబంధించి మెరల్ సోషల్ మీడియా వేదికగా వివరాలు వెల్లడించింది. ఒక పెద్ద ప్రక్రియ పూర్తయింది. ఎట్టకేలకు జయకు వీసా, పాస్‌పోర్ట్ వచ్చింది. నాతో పాటు జయను తీసుకువెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. అని తెలిపింది. జయ అనే కుక్కను ఇష్టపడిన మెరల్.. దాన్ని విడిచి పెట్టి తన సొంత దేశం నెదర్లాండ్స్ వెళ్లలేకపోయింది. దీంతో పట్టుబట్టి పాస్‌పోర్ట్ ఆఫీస్‌కు వెళ్లి అక్కడి అధికారులతో చర్చించింది. ఆ కుక్కకు పాస్‌పోర్టు, వీసా రావడానికి 6 నెలలు సమయం పడుతుందని అధికారులు చెప్పగా.. అప్పటివరకు ఉంటా అంటూ గత 6 నెలలుగా కుక్క కోసమే ఉండిపోయింది. చివరికి జయ కుక్కకు వీసా, పాస్‌పోర్ట్ లభించడంతో అది నెదర్లాండ్స్కు వెళ్లేందుకు అన్ని సిద్ధం అయ్యాయి. తనకు సాధారణంగానే కుక్కలు అంటే ఇష్టమని.. ఇక జయను చూసినప్పుడే అది తనకు ఎంతగానో నచ్చిందని మెరల్ బొటెన్ బల్ ట్విట్టర్లో తెలిపారు. జయను తనతో పాటు తీసుకెళ్లేందుకు అన్ని సిద్దం చేసుకున్నట్లు చెప్పారు.