కేరళలో ఆదివారం ఉదయం జరిగిన వరుస బాంబు పేలుళ్లు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి. ఈ ఘటనలో ఒక మహిళ దుర్మరణం చెందగా.. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మూడు పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎన్ఐఏతోపాటు కేరళ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ బాంబు పేలుళ్లకు పాల్పడింది తానే అంటూ ఓ వ్యక్తి పోలీసుల ముందు లొంగిపోవడం కలకలం రేపుతోంది. దీంతో పోలీసులు, ఎన్ఐఏ అధికారులు ఆ వ్యక్తిని విచారణ జరుపుతున్నారు.
ఈ బాంబు పేలుళ్లకు సూత్రధారి తానే అంటూ కేరళలోని త్రిస్సూర్ పోలీసుల ముందు ఓ వ్యక్తి లొంగిపోయాడు. ఆ అనుమానితుడిని డొమినిక్ మార్టిన్‌గా గుర్తించారు. డొమినిక్ మార్టిన్ అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తేల్చారు. ఈ కేసులో అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆ కన్వెన్షన్ హాల్ మధ్యలో పేలుడు జరిగిందని పోలీసులు చెప్పారు. అయితే ఈ బాంబు పేలుళ్ల వెనుక డొమినిక్ మార్టిన్ హస్తం ఉందా లేదా అనే విషయాలను పోలీసులు ఇంకా నిర్థారించలేదు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తిని విచారిస్తున్నారు. ఐఈడీ పేలుడు కారణంగానే భారీ పేలుడు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఐఈడీ బాంబులను టిఫిన్స్ బాక్సుల్లో పెట్టి పేల్చినట్లు కేరళ డీజీపీ షేక్ దర్వేష్ సాహెబ్ తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ సోమవారం 10 గంటలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.
ఆదివారం ఉదయం 9.40 గంటలకు కేరళలోని కలమస్సేరి వద్ద ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్‌లో భారీ పేలుడు చోటు చేసుకుంది. 3 రోజుల ప్రార్థనల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం దాదాపు 2 వేల మంది ప్రజలు పాల్గొన్నారు. ఇక కేరళలో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకోవడంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబైలో హై అలర్ట్ విధించారు. ఢిల్లీ, ముంబై నగరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రద్దీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా ముంబైలోని యూదుల కేంద్రమైన చాబాద్ హౌస్ వద్ద భద్రతను పెంచారు. దేశంలో పండుగల సీజన్, వన్డే ప్రపంచకప్‌కు జరుగుతున్న నేపథ్యంలో ముంబైలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.