పెళ్లి చేసుకునే వారు తమ భాగస్వామికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో ముందే చెప్పేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో, మ్యాట్రిమోనీ సైట్లలో ప్రకటనలు కూడా అలాగే ఇచ్చేస్తున్నారు. అయితే తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ తనకు కావాల్సిన భర్త ఎలా ఉండాలి.. అతడికి ఏ ఏ లక్షణాలు ఉండాలి అనే విషయాలన్నింటినీ కలిపి ఒక ప్రకటన రూపంలో మ్యాట్రిమోనీ సైట్‌లో ఉంచింది. అయితే ఆ లిస్ట్‌కు సంబంధించిన ప్రకటన కాస్తా సోషల్ మీడియాలోకి రావడంతో అది వైరల్‌గా మారుతోంది. ఆ యువతి తనకు కావాల్సిన వరుడి విషయంలో కొంచెం వింత నిబంధనలు పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రియా అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తనకు కావాల్సిన వరుడి గురించి ఇచ్చిన మ్యాట్రిమోనీ ప్రకటన ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతోంది. తనకు వరుడు కావాలని యాడ్ ఇవ్వడం వరకు ఓకే గానీ అందులో పెట్టిన కండీషన్లే కొంచెం కొత్తగా ఉన్నాయి. అయితే తాను రీల్స్ చేస్తానని.. ఆ రీల్స్ చేయడానికి సరిపోయే వ్యక్తి కావాలని అందులో తెలిపింది. ఇక ఆ వ్యక్తి రీల్ భాగస్వామి మాత్రమే కాకుండా రియల్ భాగస్వామిగా ఉండాలని తెలిపింది. దీంతోపాటు తనకు వరుడుగా రాబోయే వ్యక్తికి కెమెరా ముందు నటించేందుకు సిగ్గు ఉండకూడదని తెలిపింది. తనతో కలిసి కపుల్ రీల్స్ చేయాలని అందులో పేర్కొంది. కొత్త కొత్త వీడియోలకు, ట్రెండింగ్ మ్యూజిక్ రీల్స్‌కు ఆలోచనలు ఇవ్వాలని వెల్లడించింది. ఇక తనకు వరుడిగా వచ్చే వ్యక్తి జాయింట్ ఫ్యామిలీకి చెందినవాడు కాకూడదని స్పష్టం చేసింది.
ఇక ఇవన్ని కండీషన్లతోపాటు మరికొన్ని షరతులను కూడా ఆ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది. తనను కలుసుకునే ముందు అమెజాన్ మినీ టీవీలో స్ట్రీమ్ అవుతున్న "హాఫ్ లవ్ హాఫ్ అరెంజ్‌డ్ " చూసి నాకు ఎలాంటి అబ్బాయి నచ్చుతాడో తెలుసుకోవాలని పేర్కొంది. ఇక చివరగా.. తాను చేసే రీల్స్.. వ్లాగ్స్‌ను ఎడిట్ చేయడానికి ప్రీమియర్ ప్రో వచ్చి ఉండాలని కూడా తెలిపింది. అయితే ప్రస్తుతం ఆ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఇచ్చిన మ్యాట్రిమోనీ ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా అవుతోంది. దీనికి నెటిజన్ల నుంచి భిన్నరకాలైన స్పందన వస్తోంది. కొందరు తనకు తగిన జోడీని ఎంచుకునేందుకు ఆ యువతి ముందుగానే ప్రిపేర్ అయి.. సరైన ప్రకటన ఇచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం అసలు ఆ రీల్స్, సోషల్ మీడియానే పెద్ద పిచ్చి అనుకుంటే తనకు కాబోయేవాడు కూడా అలాంటి వాడే కావాలని కోరుకోవడం.. దాన్ని కూడా ఇలా ప్రకటన వేసి మరీ చెప్పడం ఏంటని విమర్శలు చేస్తున్నారు.